హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి తెదేపాలో మిగిలిన అందరి ఎమ్మెల్యేల కంటే బాగా పనిచేస్తున్నారనే మంచి పేరు సంపాదించుకొన్నారు. ఒకపక్క సినిమాలు చేస్తున్నప్పటికీ, తన నియోజక వర్గం, జిల్లా అభివృద్ధికి ఆయన చాలా కృషి చేస్తున్నారు. కానీ ఆయన వ్రాసిన ఒక లేఖ కారణంగా హిందూపురం మునిసిపాలిటీకి బ్రేకులు పడ్డాయి.
ఆస్తి పన్నులు 100 శాతం వసూలు చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అమృత్ నగరాల పధకం’ ద్వారా లబ్ది పొందవచ్చనే ఉద్దేశ్యంతో, ఈ నెలాఖరులోగా పన్నులు వసూళ్లు చేయడానికి మునిసిపల్ అధికారులు 14 బృందాలుగా ఏర్పడి పట్టణంలోని పన్ను బకాయిలున్న వారిపై ఒత్తిడి చేస్తున్నారు.
ఈ విషయం బాలకృష్ణ చెవిన పడటంతో ఆయన మునిసిపల్ శాఖ మంత్రి పి. నారాయణకి ఒక లేఖ వ్రాసారు. పన్నులపై వడ్డీలను కొంత సడలించి, పన్ను చెల్లింపులకి గడువు ఏప్రిల్ నెలాఖరు వరకు పెంచాలని ఆయన తన లేఖలో కోరారు. ఆ కారణంగా హిందూపురం మునిసిపల్ అధికారులు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురయింది. ఈ విషయంలో ముందుకు వెళితే బాలకృష్ణకి కోపం వస్తుంది. పన్నులు వసూలు చేయకపోతే కేంద్ర పధకం చేజార్చుకోవలసి వస్తుంది. కనుక తమ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల కొరకు వారు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.