ఒక వ్యక్తి ఏ రంగంలోనయినా రాణించాలంటే అందుకు ఎన్నో ఏళ్ళపాటు నిర్విరామంగా కష్టపడవలసి ఉంటుంది. అంతే కాదు అదృష్టం కూడా కలిసిరావాలి. రాజకీయాలలో అయితే అదింకా కష్టం. కానీ కేవలం నెలరోజుల వ్యవధిలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్న వ్యక్తి జె.ఎన్.యు. విద్యార్ధి కన్నయ్య కుమార్. అయితే అతనికి ఆ గుర్తింపు కల్పించింది కేంద్రప్రభుత్వమేనని చెప్పక తప్పదు. అందుకు దానికి అతను ఎంతయినా రుణపడి ఉండవచ్చును.
ఇప్పుడు దేశంలో కన్నయ్య కుమార్ ఒక హీరో అయిపోయాడు. కనుక అతని ప్రతీ మాట, చర్య మీడియాలో కనబడుతోంది. ఇవ్వాళ్ళ అతను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి (హెచ్.సి.యు.) రాబోతున్నాడు. హెచ్.సి.యు. విద్యార్ధి రోహిత్ సంతాప సభలో పాల్గొన్నాక, యూనివర్సిటీలో విద్యార్ధులను ఉద్దేశ్యించి అతను మాట్లాడుతాడు. బహుశః డిల్లీ పోలీసులు తన పట్ల ప్రదర్శించిన అత్యుత్సాహం గురించి, వారికి కోర్టులు మొట్టికాయలు వేయడం, దేశం గురించి తన వ్యక్తిగత అభిప్రాయాలను హెచ్.సి.యు.విద్యార్ధులతో పంచుకోవచ్చును. రేపు కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటాడు. క్లుప్తంగా ఇదీ అతని పర్యటన వివరాలు.
అయితే కన్నయ్య కుమార్ తో సహా బయటవారెవరినీ కూడా యూనివర్సిటీ ప్రాంగణంలోకి అనుమతించబోమని యూనివర్సిటీ అధికారులు చెపుతున్నారు. కనుక మళ్ళీ హెచ్.సి.యు.లో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. భారీగా పోలీసులు మొహరించి ఉన్నారు. కన్నయ్య కుమార్ ని లోపలకి అనుమతించకపోయినట్లయితే, హెచ్.సి.యు.విద్యార్ధులు తప్పకుండా ఆందోళన చేపట్టడం తధ్యం. యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ అప్పారావు నిన్న బాధ్యతలు స్వీకరించడానికి వచ్చినప్పుడు విద్యార్ధులు తీవ్రంగా వ్యతిరేకించడంతో యూనివర్సిటీలో యుద్ద వాతావరణం నెలకొని ఉంది. ఇప్పుడు కన్నయ్య కుమార్ కూడా వచ్చి చేరితే అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుంది. కనుక అతనిని యూనివర్సిటీ లోపలకి అనుమతించక పోవచ్చును. అయితే కమ్యూనిస్ట్ పార్టీ అతనికి మద్దతు ఇస్తోంది కనుక బహుశః యూనివర్సిటీ బయట ఎక్కడో ఒక చోట విద్యార్ధులతో సమావేశం ఏర్పాటు చేయవచ్చునని భావిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే అనుకూలంగా ఉన్నట్లయితే కన్నయ్య కుమార్ రాజకీయాలలోకి వచ్చే అవకాశాలున్నాయని భావించవచ్చును.