పఠాన్ కోట్ లో మళ్ళీ ఈరోజు కలకలం మొదలయింది. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆయుధాలతో వచ్చి దారిన వెళుతున్న ఒక కారుని ఆపి డ్రైవర్ కి తుపాకులు చూపి బెదిరించి వాహనాన్ని ఆపహరించుకుపోయినట్లు తాజా సమాచారం. ఈ సంగతి తెలిసిన వెంటనే పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యి చుట్టుపక్కల ప్రాంతాలలో తనికీలు మొదలుపెట్టారు. డిల్లీ పోలీసులను కూడా అప్రమత్తం చేసారు. ఆ వాహానాన్ని అపహరించుకొని పోయిన వారు ఎవరు? ఎటువైపు వెళ్ళారు? వంటి వివరాలను సేకరించేపనిలో పడ్డారు స్థానిక పోలీసులు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముందు కూడా ఇలాగే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు పఠాన్ కోట్ నుంచి డిల్లీకి ఒక టాక్సీని బుక్ చేసుకొని దారిలో ఒక బ్రిడ్జ్ వద్ద ఆ టాక్సీ డ్రైవర్ ని కాల్చి చంపి టాక్సీని అపహరించుకొనిపోయారు. మళ్ళీ దానిని వదిలిపెట్టి డిల్లీ శివార్లలో గోర్గావ్ నగరంలో ఒక పోలీస్ ఉన్నతాధికారికి చెందిన వాహనాన్ని అపహరించుకొని పోయారు. వారు గణతంత్ర దినోత్సవ వేడుకలలో విద్వంసం సృష్టించాలనే ప్రయత్నంతోనే డిల్లీ వచ్చినట్లు గుర్తించారు. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలలో చాలా కట్టుదిట్టమయిన భద్రతా ఏర్పాట్లు చేయడం వలన వారి ప్రయత్నాలు ఫలించలేదు కానీ ఇంతవరకు పోలీసులు వారి ఆచూకిని కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు వారికి మరో ముగ్గురు తోడయినట్లున్నారు. కానీ ప్రతీసారి వారు పఠాన్ కోట్ నుంచే ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. అయినప్పటికీ పోలీసులు వారిని పట్టుకోలేకపోవడం విస్మయం కలిగిస్తోంది. భారత్ లోకి ప్రవేశిస్తున్న అటువంటి వారి వలన ఎప్పుడయినా, ఎక్కడయినా, ఏదయినా జరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. మరి పోలీసులు, నిఘావర్గాలు వారిని ఎప్పటికి పట్టుకోగలుగుతాయో చూడాలి.