హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత రెండు రోజులుగా మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. జె.ఎన్.యు. విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ ఇవ్వాళ్ళ సాయంత్రం యూనివర్సిటీకి రాబోతున్న కారణంగా ఇవ్వాళ్ళ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారింది. మరోపక్క ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈరోజు ఉదయం నుంచి అకస్మాత్తుగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. యూనివర్సిటీ లైబ్రేరీ సమీపంలో ఉన్న ఒక నీళ్ళ ట్యాంకులో గుర్తు తెలియని ఒక యువకుడి శవం దొరికింది. అది యూనివర్సిటీ విద్యార్ధిదేనని విద్యార్ధులు ఆందోళనకి దిగారు. అతని చావుకి కారణాలు ఏమిటో తెలియకపోయినా అతను మూడు రోజుల క్రితమే అతను ఆత్మహత్య చేసుకొని ఉంటాడని వారు అనుమానిస్తున్నారు. అతని శవాన్ని పట్టుకొని విద్యార్ధులు ఆందోళనకి దిగితే, పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసారు. అతను యూనివర్సిటీలో పనిచేసే ఒక దినసరి కూలీ అని, ప్రమాదవశాత్తు నీళ్ళ ట్యాంకులో పది మరణించిఉంటాడని పోలీసులు చెపుతున్నారు. కానీ అతను కూడా యువకుడయి ఉండటం, శవం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో, చనిపోయింది విద్యార్దేనని విద్యార్ధులు అపోహపడి అనవసరంగా ఆందోళన చేపట్టారని పోలీసులు వాదిస్తున్నారు. దర్యాప్తులో అతను మాణిక్య నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తని తేలిందని పోలీసులు చెప్పారు. తమకు మరో కొంత సమయం ఇస్తే మృతిని పూర్తి వివరాలు దర్యాప్తు చేసి తెలియజేస్తామని పోలీసులు చెపుతున్నారు. కానీ విద్యార్ధులు మాత్రం పోలీసుల మాటలను నమ్మడం లేదు. వారు ఉద్దేశ్యపూర్వకంగానే మృతిని వివరాలను, చివరికి అతని తల్లి తండ్రుల వివరాలను కూడా మార్చి చెపుతున్నారని వాదిస్తున్నారు. ఆ కారణంగా ప్రస్తుతం యూనివర్సిటీలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది.