రన్…
కథేంటి?
సంజూ (సందీప్ కిషన్) తన చెల్లాయి పెళ్లి కోసం వడ్డీ రాజా దగ్గర అప్పు చేస్తాడు.నాలుగు నెలల్లో బాకీ తీర్చాలి. బాకీ తీర్చాల్సిన రోజు సంజూ చేతిలో ఉన్న డబ్బు పోతుంది. మరోవైపు ప్రేమించిన అమ్మాయి అమ్మూ(అనీషా)ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. సంజూపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవుతుంది. సాయిత్రంలోగా అసలు, వడ్డీ కట్టకపోతే ప్రాణాలు తీస్తా అంటాడు వడ్డీరాజా. ఇవన్నీ చాలవు అన్నట్టు సంజూ బావ ‘నాకు లక్ష కావాలి.. అదీ సాయింత్రం లోగా’ అంటూ అల్టిమేట్టం జారీ చేస్తాడు. ఈ సమస్యల నుంచి మన హీరో ఎలా బయటపడ్డాడు అన్నది కథ.
* నటీనటుల ప్రతిభ
సందీప్ కిషన్‌కి తగిన పాత్ర కాదిది. తన బలం ఎనర్జీగా కనిపించడం. అది ఈ సినిమాలో అణుమాత్రం కూడా లేదు. నేరమ్ సినిమా నచ్చి ఈ సినిమా ఒప్పుకొని ఉంటాడేమో? సినిమా మొత్తం నీరసంగా కనిపించాడు. ఒక్క ఫ్రేములోనూ నవ్వలేదు. బహుశా సటిల్డ్ పెర్‌ఫార్మ్సెన్స్ అంటే ఇదే అనుకొన్నాడేమో? అనిషా అంబ్రోస్ పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. ప్రతినాయకుడి పాత్ర, గెటప్ ఆకట్టుకొంటాయి. మహత్ రాఘవేంద్రతో రింగ్ టోన్ సన్నివేశం నచ్చుతుంది. మిగిలిన వాళ్లంతా తమ పాత్ర పరిధి మేర నటించారు.
* సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా ఈ సినిమా బాగుంది. సాయి కార్తీక్ కష్టపడ్డాడు. కెమెరా వర్క్ బాగుంది. కానీ దర్శకత్వమే వీక్. ఏ సీన్ కూడా ఉత్కంఠభరితంగా తెరకెక్కించలేకపోయాడు. వినోదం మిస్సయ్యింది. పోసాని, బ్రహ్మాజీ ఉన్నా నవ్వులు రాబట్టుకోలేకపోయాడు. మాటలూ నామమాత్రమే.
*విశ్లేషణ
ఒక రోజు జరిగే కథ ఇది. తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. పైగా థ్రిల్లర్ చిత్రాలు ఈ మధ్య తెగ ఆడుతున్నాయి. ఆ ధైర్యంతోనే నేరమ్ని రీమేక్ చేసుంటారు. కానీ థ్రిల్లర్ చిత్రాల్లో ఉండాల్సిన వేగం ఈ సినిమాలో మిస్సయ్యింది. సినిమా అంతా ఒకే పాయింట్ చుట్టూ తిరగడం కూడా బోరే. ఎంతసేపు చూసినా కథ అక్కడే తచ్చాడుతుంటుంది. ఇక థ్రిల్లింగ్ ఎక్కడ ? హీరో హీరోయిన్ల మధ్య ఉండాల్సిన రొమాంటిక్ యాంగిల్ పూర్తిగా మర్చిపోయాడు దర్శకుడు. అది చాలదన్నట్టు కథానాయికని సెకండాఫ్‌లో కారు డిక్కీలో పడుకోబెట్టేశాడు. క్లైమాక్స్‌కి గానీ ఆవిడగారు లేవరు. ఇక కామెడీ అయినా ఉందా అంటే అంతంత మాత్రమే. హీరో తప్ప అందరూ హుషారుగానే ఉంటారు. కానీ ఎవ్వరూ నవ్వించలేకపోయారు. ఒక్క బ్రహ్మాజీనే కాస్త ప్రయత్నించాడంతే. ఇన్ని సమస్యల్ని హీరో ఎలా చేదిస్తాడా అన్నది ముఖ్యమైన పాయింట్. ఏదో మ్యాజిక్ చేస్తాడులే అనుకొంటారు. కానీ దానికీ ఆస్కారం ఇవ్వలేదు. అమాంతంగా క్లైమాక్స్ వచ్చిపడి పోతుంది. హీరో తన హీరోయిజం ఏమీ చూపించకుండానే సమస్యల్నీ సర్దుకొంటాయి. అదే ఈ సినిమా విచిత్రం. ఈమాత్రం కథ మలయాళంలో,తమిళంలో ఎలా హిట్టయిపోయిందో ! ఎంతైనా తమిళ తంబీలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
సినిమాకు కరెక్టు పేరు పెట్టారు దర్శక నిర్మాతలు. కాకపోతే పోస్టరు చూసి, అందులో హీరోని చూసి, ట్రైలర్లు చూసి, అందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని చూసి థియేటర్లోకి రన్నింగ్ చేసుకొంటూ ఆడియన్స్ వచ్చేస్తారని భావించి ఉంటారు. కానీ సీన్ రివర్స్ అయ్యిందిక్కడ. హీరో నీరసం చూసి,స్క్రీన్ ప్లే లోని చాదస్తం చూసి, నత్తనడక నడిచే సన్నివేశాల్ని చూసి,థియేటర్లోంచి ప్రేక్షకుడు రన్ అందుకొంటాడు. అలా ఉంది… మన రన్!! కథానాయకుడు బాధ పడ్డానికీ ప్రేక్షకుల్ని బాధ పెట్టడానికే పుట్టుంటాడు. అమ్మో బోల్డన్ని బాధలు. జేబులో ఉన్నది రూపాయి. బావగారు బిరియానీ తినిపించి బిల్లు చేతికిచ్చి పారిపోతాడు. అంతకంటే నిష్టదరిద్రం ఉంటుందా? జ్యూసు సెంటరుకు వెళ్తాడు. పైనాపిల్ బనానా, ఆరెంజ్, యాపిల్. ఏం కావాలి నాయినా అని అడుగుతాడు. మన హీరో మాత్రం ‘నీళ్లు’ అంటాడు నీళ్లు నములుతూ. వాడేమో.. వికారంగా చూస్తాడు. దాంతో.. బోరింగు నీళ్లతో కడుపు నింపుకొంటాడు.థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడి కడుపు తరుక్కపోతుంది. మరీ ఇంత నిష్టదరిద్రమా? అని.
* చివరిగా : ‘నేరమ్’ చేసేశారు !
తెలుగు360.కామ్ రేటింగ్: 2.5/5
బ్యానర్ ; ఏకే ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు : సందీప్ కిషన్, బాబీ సింహ, అనీషా.. తదితరులు
ఎడిటింగ్ :యమ్ . ఆర్. వర్మ
సంగీతం : సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ : రాజశేకర్ ,
రచనా సహకారం : ప్రసన్నా
నిర్మాత : సుధాకర్ చెరుకూరి, కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర
సమర్పణ : రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం : అని కన్నెగంటి
విడుదల తేది : 23 మార్చ్ 2016