బుదవారం ఉదయం విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలోని వైకాపా నేతల సమావేశం జరిగింది. దానిలో వైకాపా ఎమ్మెల్యేలు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేకా ప్రతాప్, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పార్టీని విడిచిపెట్టి తెదేపాలో చేరడంతో పశ్చిమ నియోజక వర్గానికి పట్టిన దరిద్రం పోయిందని అన్నారు. చంద్రబాబు నాయుడుకి దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ వంటివేవయినా ఉన్నట్లయితే, తక్షణమే పార్టీలో చేరిన ఆ 8మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి, ఉపఎన్నికలు నిర్వహించి, ఎన్నికలలో గెలిచి చూపించాలని సవాలు చేసారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఇతర నేతలు కూడా ఇంచుమించు అలాగే మాట్లాడారు.
జలీల్ ఖాన్ వెళ్ళిపోవడంతో పశ్చిమ నియోజక వర్గానికి పట్టిన దరిద్రం పోయిందని కొడాలి నాని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకాలం ఆ దరిద్రం తమ పార్టీలోనే ఉన్నప్పుడు ఆయన దానిని ఆనందంగా భరించారు. జలీల్ ఖాన్ తన నియోజకవర్గానికి ఏమీ చేయలేదనే ఉద్దేశ్యంతోనే కొడాలి నాని ఆ విధంగా అని ఉంటే మరి ఇంత కాలం ఆ నియోజక వర్గ ప్రజలు తమ పార్టీ ఎమ్మెల్యే వలననే చాలా నష్టపోయారని చెప్పుకొంటున్నట్లు భావించవలసి ఉంటుంది. పార్టీలో ఉన్నప్పుడు ఒకరి గురించి మరొకరికి ఇటువంటి ‘గొప్ప అభిప్రాయాలు’న్నాయనే సంగతి బయటపడవు కానీ పార్టీ వీడగానే ఒకరి కధలు మరొకరు చెప్పుకోవడం మొదలుపెట్టి, వారిపట్ల ప్రజలకున్న భ్రమలు తొలగించేస్తుంటారు.