జె.ఎన్.యు.విద్యార్ధి సంఘం నేత కన్నయ్య కుమార్ బుదవారం ఉదయం హైదరాబాద్ వచ్చినపుడు ఒక తెలుగు ఛానల్ ప్రతినిధికి చిన్న ఇంటర్వ్యూ ఇచ్చేడు. దానిలో తన అభిప్రాయలు ఈవిధంగా వ్యక్తం చేసాడు.
“భగత్ సింగ్ వంటి మహనీయులు ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్ వాళ్ళను దేశం నుంచి తరిమి కొట్టి దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిపెట్టారు. కానీ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో పరిస్థితులను చూస్తుంటే మనకి స్వాతంత్ర్యం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోంది. ప్రభుత్వం మమ్మల్ని (విద్యార్ధులని) బ్రిటిష్ వాళ్ళలాగ చూస్తోంది. అరెస్టులు, కోర్టు కేసులతో మమ్మల్ని భయబ్రాంతులని చేయాలనుకొంటోంది పోలీసులను, లాటీలను మామీద ప్రయోగించి బలవంతంగా మా గొంతులను అణచివేయాలని ప్రయత్నిస్తోంది. కానీ మేము అటువంటివాటికి భయపడేవాళ్లము కాదని ప్రభుత్వం గ్రహిస్తే మంచిది. ఇప్పుడు భావప్రకటన స్వేచ్చను హరిస్తున్న ప్రభుత్వం మున్ముందు మన ఇళ్ళలోకి కూడా జొరబడి మనం ఏమి తినాలి…ఏ బట్టలు వేసుకోవాలి…ఎప్పుడు బయటకి వెళ్ళాలి..వంటివి కూడా నియత్రించడం మొదలుపెట్టవచ్చును. కనుక ఈ అణిచివేతకు వ్యతిరేకంగా, సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ కి న్యాయం జరిగేవరకు మా పోరాటం కొనసాగుతుంది. విశ్వవిద్యాలయాలలో విద్యార్ధులు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా చదువుకొనే వాతావరణం కలిగి ఉండాలని నేను కోరుకొంటున్నాను. అందుకోసం రోహిత్ పేరిట ఒక చట్టం ఏర్పరచే వరకు నా పోరాటం కొనసాగిస్తాను,” అని కన్నయ్య కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.
కన్నయ్య కుమార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి ప్రవేశించాలనుకొన్నప్పుడు, పోలీసులు అతనిని అడ్డగించడంతో అతను గేటు బయటే విద్యార్ధులను ఉద్దేశ్యించి ప్రసంగించాడు.