కాపులకు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం ఇవ్వాళ్ళ తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో తన నివాసంలో కాపు సంఘాల నేతలతో సమావేశంకానున్నారు. దీనికి రాష్ట్రంలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన నేతలు, విద్యార్దీ సంఘం నేతలు, హైదరాబాద్ నుంచి కూడా రాష్ట్రానికి చెందిన ఆ కులాల నేతలు హాజరుకాబోతున్నారు. ముద్రగడ పద్మనాభం ఆరంభించిన పోరాటం కారణంగానే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చి కాపు కార్పోరేషన్ కి బడ్జెట్ లో రూ.1000 కోట్లు కేటాయించినపటికీ, కాపులకు రిజర్వేషన్ల కేటాయించాలన్న ప్రధాన డిమాండ్ ఇంకా నెరవేర్చవలసి ఉంది. కనుక ఈరోజు సమావేశంలో ఇంతవరకు జరిగిన పోరాటం, దాని మంచి చెడ్డలు, ఫలితాల గురించి చర్చించి, ఇక ముందు అనుసరించవలసిన కార్యాచరణ పధకాన్ని రూపొందించుకొంటారని సమాచారం. కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ చేస్తున్న పోరాటాన్ని ఎవరూ తప్పు పట్టనప్పటికీ, ఆయన ఆకస్మికంగా దీక్షలకు కూర్చోవడం మళ్ళీ అర్ధాంతరంగా విరమిస్తుండటం పట్ల కాపు ప్రజలలో కొంచెం అసంతృప్తి నెలకొని ఉంది. నేటి సమావేశంలో ఆ విషయం గురించి కూడా చర్చించి, ఇకపై ఒక పద్ధతి ప్రకారమే ఉద్యమం నడిపేలా జాగ్రత్తలు తీసుకోవచ్చునని తెలుస్తోంది. అదే విధంగా తమ ఉద్యమంలో జగన్ ప్రమేయం, ప్రోద్బలం ఉందనే ప్రభుత్వ ఆరోపణలకు ఈరోజు సమావేశం తరువాత జవాబు చెప్పే అవకాశం ఉందని భావించవచ్చును.