వైకాపా అధికారంలోకి వచ్చి, తను ముఖ్యమంత్రి అయితేనే ప్రజల కష్టాలన్నీ తీరుతాయని జగన్మోహన్ రెడ్డి పదేపదే చెప్పుకోవడం వింటూనే ఉంటాము. ఆయన మాటలలో ప్రజల కష్టాలు తీర్చాలనే తపన కంటే తను ముఖ్యమంత్రి అవ్వాలనే తపనే ఎక్కువగా కనబడుతుంటుందని తెదేపా నేతలు విమర్శిస్తుంటారు. అయితే అంత మాత్రాన్న జగన్మోహన్ రెడ్డి ఏమీ తన మనసులో ఆ కోరికను దాచుకొనే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. రాష్ట్రంలో అందరికంటే అత్యుత్తమయిన నాయకుడు తనేనని, కనుక ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే హక్కు తనకి మాత్రమే ఉందని ఆయన దృడంగా నమ్ముతున్నారని నిన్న ఆయన నెల్లూరులో మాట్లాడిన మాటలే పట్టిస్తున్నాయి. “కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి నేను, మా అమ్మ బయటకి వచ్చి నుదుటన చెయ్యి పెట్టుకొని తేరిపార చూస్తే రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు కనిపించాయి కానీ రాష్ట్రంలో సమర్దుడయిన నేత ఒక్కడు కూడా కనబడలేదు. మళ్ళీ తేరిపార చూస్తే మేమిద్దరమే (జగన్, ఆయన తల్లి విజయలక్ష్మి) కనబడ్డాము,” అని అన్నారు.
చంద్రబాబు నాయుడు వ్యూహాలను ఎదుర్కోలేక పదేపదే బోర్లా పడుతున్న జగన్మోహన్ రెడ్డి, ఈవిధంగా అతిశయం ప్రదర్శిస్తూ గొప్పలు చెప్పుకోవడం చూసి ప్రజలు, చివరికి స్వంత పార్టీలో నేతలు కూడా నవ్వుకొంటే వాళ్ళని తప్పు పట్టలేము. అయితే పార్టీలో నేతలు ఆ మాట ధైర్యంగా బయటకి అనలేరు కనుక వారు కూడా ఆయనకు వంతపాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ప్రజల సమస్యలన్నీ తీరిపోతాయని, రాష్ట్రాభివృద్ధి జరిగి మళ్ళీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి నాటి స్వర్ణయుగం వస్తుందని చెప్పుకొంటున్నారు. అయితే అది ఎలాగా సాధ్యమో వారికీ తెలియదు.
ఈసారి ఈ ముక్క అన్నది మరెవరో కాదు ఏదో ఒకరోజు తెదేపాలోకి జంప్ చేసేస్తారనుకొంటున్న వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసే వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టుల అవినీతిలో మంచి అభివృద్ధి కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేసారు.
అయినా జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రి అయితే ప్రజా సమస్యలన్నిటినీ పరిష్కరించేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేసి మళ్ళీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి నాటి స్వర్ణయుగం తీసుకురావడానికి ఆయన వద్ద మంత్రదండం ఏమీలేదు కదా? ఒకవేళ ఉండి ఉంటే 2014 ఎన్నికలలో దానిని ప్రజలకు చూపించి ఉంటే, ప్రజలు ఆయనకే ఓట్లు వేసి ముఖ్యమంత్రిగా చేసుకొనేవారు కదా?
రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, రాష్ట్రం మళ్ళీ నిలద్రొక్కుకోవడానికి కేంద్రం సహకరించాలని, రాష్ట్రానికిచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోరుతునప్పుడు, ఆయనే ముఖ్యమంత్రి అయినా కూడా ఏమి చేయలేరని స్పష్టం అవుతోంది. అటువంటప్పుడు స్వర్ణయుగాలు ఎలాగా సాధ్యమో వైకాపా నేతలకి, ఆయనకే తెలియాలి.
గత 22నెలలుగా రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని తిప్పలు పడుతున్నా ఇంతవరకు పనులు మొదలుకాలేదు. డిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేస్తున్న ప్రత్యేక హోదా కాదు కదా కనీసం రైల్వే జోన్ కూడా మంజూరు కాలేదు. భాజపా కి మిత్రపక్షంగా ఉన్న తెదేపావల్లనే కానప్పుడు, జాతీయ పార్టీలయిన భాజపాతో కానీ, కాంగ్రెస్ పార్టీతో గానీ సరయిన సంబంధాలు లేని జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా ఈ పనులు పూర్తి చేయగలరు? అని ఆలోచిస్తే ఆయన కూడా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేందుకే “గోల్డెన్ ఈరా డ్రీమ్స్” చూపిస్తున్నారని అర్ధం అవుతుంది.