పౌరాణిక సినిమాలు, సీరియల్స్ లో యుద్ధం సీన్లలో ఒకరు అగ్నిబాణం (ఆగ్నేయాస్త్రం) ప్రయోగిస్తే, ఎదుటవారు దానిని నీళ్ళ బాణం(వారుణాస్త్రం)తో అడ్డుకోవడం అందరం చాలాసార్లే చూసి ఉంటాము. మన రాజకీయాలలో, చట్ట సభలలో కూడా ఒకరిపై మరొకరు ఇంచుమించు అలాంటి బాణాలే సంధించుకొంటారు. శాసనసభలో రోజా దాడి చేస్తే, ఆమెపై అధికార పార్టీకి చెందిన అనిత వంటి మహిళా ఎమ్మెల్యేలు ఎదురు దాడి చేస్తుంటారు. ఒకవేళ కొడాలి నాని మాట్లాడితే దానికి ఏ అచ్చం నాయుడో జవాబిస్తారు. జగన్ మాట్లాడితే యనమల రామకృష్ణుడు లేదా చంద్రబాబు నాయుడు లేచి జవాబిస్తుంటారు. ఈవిధంగా అవతల వారి స్థాయిని బట్టి ఇవతల వాళ్ళు లేచి ఎదురుదాడి చేస్తుంటారు. రోజా విషయంలో చాలా మంది తెదేపా ఎమ్మెల్యేలూ మాట్లాడినప్పటికీ, యుద్ధం మాత్రం ఆమెకి అనిత మధ్యనే జరిగిందని చెప్పవచ్చును. మహిళ అయిన రోజాని మగ ఎమ్మెల్యేలు ఎదుర్కోవడం కంటే మహిళా ఎమ్మెల్యే చేతనే ఎదురుదాడి చేయిస్తే పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదనే ఉద్దేశ్యంతోనే అనితను ముందుకు పంపినట్లు భావించవచ్చును. అనిత కూడా రోజాకి ఏమాత్రం తక్కువ కాకుండా అవసరమయినప్పుడల్లా కన్నీళ్లు కార్చుతూ రోజా సస్పెన్షన్ కాదని చాలా రక్తి కట్టించారు. రోజా శాసనసభ బయట కన్నీళ్లు కార్చితే, అనిత లోపల కన్నీళ్లు కార్చుతారు అంతే తేడా.
అయితే ఆమె రావెల కిషోర్ మంత్రిత్వ శాఖ మీద కన్నేయడం వలననే అంతగా డ్రామా ఆడుతున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి గొల్ల బాబురావు విమర్శించారు. ఆమె తన పాయకరావుపేట నియోజక వర్గం కోసం చేసిందేమీ లేకపోయినప్పటికీ, మంత్రి పదవి కోసం చాలా చక్కగా నటించేస్తూ మొసలి కన్నీళ్లు కార్చేస్తున్నారని బాబూరావు ఎద్దేవా చేసారు. ఏదో విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మెప్పించి రావెల కిషోర్ బాబుని మంత్రి పదవి నుంచి తప్పించేసి దానిలో ఆమె సెటిల్ అయిపోవాలని ఆశపడుతున్నట్లున్నారని అన్నారు.
అనితకి నిజంగా ఆ ఆలోచనతోనే ఈ డ్రామా ఆడుతున్నారో లేక రోజాని అడ్డుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకి చెప్పడం వలననే రోజాని ఎదుర్కొంటున్నారో తెలియదు కానీ ఈ సస్పెన్షన్ డ్రామాలో రోజా కూడా రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై నిద్రపోతూ ఈ డ్రామాని ఎంత చక్కగా రక్తి కట్టించారో అందరూ చూసారు. మరి ఆమె దేనికోసం ఇంత డ్రామా చేస్తున్నారో బాబురావే చెపితే బాగుండేది కదా?