బెల్జియం రాజధాని బ్రస్సల్స్ నగరంలో జేవెంటం అంతర్జాతీయ విమానాశ్రయంలో, దాని సమీపంలో గల మెయిల్ బెక్ మెట్రో రైల్వే స్టేషన్లో మొన్న మంగళవారం జరిగిన బాంబు దాడులలో 36 మంది చనిపోగా అనేక మంది గాయపడ్డారు. వారిలో భారత్ కి చెందిన రాఘవేంద్రన్ గణేషన్ అనే ఇన్ఫోసిస్ ఉద్యోగి కూడా ఉన్నట్లు తెలిసింది.
బ్రస్సల్స్ లో భారతీయ దౌత్యవేత్తలు అతని ఆచూకి కనుగొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి అతను ఆ సమయంలో బాంబు దాడులు జరిగిన మెయిల్ బెక్ మెట్రో రైల్వే స్టేషన్లోనే ఉన్నట్లు అతని ఆఖరి ఫోన్ కాల్ ద్వారా గుర్తించగలిగారు. మంగళవారం ఉదయం అతను ప్రయాణిస్తున్న మెట్రో రైల్ మాంటో గొమ్రీ రైల్వే స్టేషన్ దాటుతున్న సమయంలో ఫోన్ కాల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. మరి కొద్దిసేపటికే ఆ రైలు మెయిల్ బెక్ మెట్రో రైల్వే స్టేషన్ కి చేరుకొంది. అదే సమయంలో స్టేషన్ లో భారీ విస్పోటనం జరిగింది. ఆ ధాటికి ఆ మెట్రో రైల్వే బోగీలు బాగా దెబ్బ తిన్నాయి. అందులో ప్రయాణిస్తున్న వారిలో చాలా మంది గాయపడ్డారు. సుమారు 25మంది చనిపోయినట్లు తెలుస్తోంది.
గాయపడిన వారినందరినీ నగరంలో వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. గణేష్ ఆఖరి కాల్ ఆధారంగా ప్రేలుడు జరిగిన సమయంలో అక్కడే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్థానిక అధికారులు అతనిని కూడా ఏదయినా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారా? లేక ఈ దాడిలో మరణించాడా? అనే విషయం అధికారులు కనుగొనలేకపోతున్నారు.
బెల్జియం దేశ చట్టాల ప్రకారం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి వివరాలను సంబంధిత అధికారుల అనుమతి లేనిదే బయటకి వెల్లడించకూడదు. అలాగే అపరిచితులు ఎవరూ ఆసుపత్రులలో ఉన్నవారిని పరామర్శించడానికి వీలు లేదు. ఆ కారణంగా భారత్ అధికారులు గణేష్ ఆచూకి ఇంతవరకు కనుగొనలేకపోతున్నారు.
జర్మనీలో పనిచేస్తున్న అతని సోదరుడు ఈరోజు ఉదయమే బ్రసల్స్ చేరుకొని, అధికారులతో కలిసి తన సోదరుడి కోసం వెతుకుతున్నారు. గణేష్ తల్లి, భార్య, వారి పసిపాప అందరూ చెన్నైలో ఉన్నారు. రెండు రోజులవుతున్న గణేష్ ఆచూకీ దొరకకపోవడంతో వారు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.
బాంబు దాడుల తరువాత బ్రసల్స్ విమానశ్రయాన్ని మూసివేయడంతో అక్కడ చిక్కుకుపోయిన 530 మంది భారతీయులను అమెస్టర్ డాం కి తరలించి, అక్కడి నుంచి నాలుగు జెట్ ఎయిర్ వేస్ విమానాలలో డిల్లీ, ముంబై, టోరెంటో నగరాలకి తరలించారు. బ్రసల్స్ విమానాశ్రయంలో ఇంకా మరో 70మంది భారతీయులు వేచి ఉన్నట్లు తెలుస్తోంది. వారిని కూడా రేపు ఉదయంలోగా అక్కడి నుండి తరలిస్తారు.
బ్రసెల్స్ బాంబు దాడులలో గాయపడిన భారతీయులను గుర్తించడానికి, విమానాశ్రయంలో చిక్కుకుపోయిన వారిని భారత్ తరలించడానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని, ఎప్పటికప్పుడు బ్రసెల్స్ లో అధికారులతో సంప్రదిస్తూ డిల్లీ నుండి వారికి అవసరమయిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంకా గణేష్ ఆచూకి తెలియవలసి ఉంది.