అవును. ప్రధాని నరేంద్ర మోడి ట్వీటర్ లో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ఫాలో అవుతున్న వారిలో ఒకరిగా చేరారు. అందుకు అరవింద్ కేజ్రీవాల్ మోడీకి కృతజ్ఞతలు తెలుపుకొంటూ “మోడీజీ మీకు హోలీ శుభాకాంక్షలు. ఈరోజు అన్ని పిర్యాదులను, కక్షలను మరిచిపోవలసిన దినం. కేంద్ర ప్రభుత్వానికి మా డిల్లీ ప్రభుత్వానికి మధ్య రానున్న రోజుల్లో సత్సంబంధాలు ఏర్పడాలని కోరుకొంటున్నాను,” అని తన ట్వీటర్లో మోడీని ఉద్దేశ్యించి ఒక మెసేజ్ పోస్ట్ చేసారు.
ప్రధాని నరేంద్ర మోడి డిల్లీ ఉపముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న మనీష్ శిశోడియాని కూడా ట్వీటర్లో ఫాలో అవుతున్నారు. అందుకు మనీష్ కూడా ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ “మోడీజీ..మీకు హోలీ శుభాకాంక్షలు. ట్వీటర్లో మీరు నన్ను ఫాలో అవుతున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నేను డిల్లీ ప్రజల తరపున మీకు చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే గత ఏడాది కాలంలో మా డిల్లీ శాసనసభ ఆమోదించి పంపిన అనేక బిల్లులు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగులో ఉండిపోయాయి. వాటినన్నిటినీ తక్షణమే పరిష్కరించినట్లయితే డిల్లీ మీకు రుణపడిఉంటుంది,” అని మెసేజ్ పోస్ట్ చేసారు.
ప్రధాని నరేంద్ర మోడి ఇటువంటి చిన్నచిన్న పనులతో అందరి దృష్టిని ఆకట్టుకొంటుంటారు. ట్వీటర్లో డిల్లీ ముఖ్యమంత్రిని ఉపముఖ్యమంత్రిని ఫాలో అయినంత మాత్రాన్న, వారి ప్రభుత్వం పట్ల ఆయన వైఖరి మారిపోతుందని ఆశించలేము. బహుశః ప్రజలను ఆకట్టుకోవడానికే ఆయన ట్వీటర్లో వారిని ఫాలో అయినట్లు భావించవలసి ఉంటుంది. కానీ ట్వీటర్లో ఫాలో అవుతునందున వారిరువురూ చేసిన విజ్ఞప్తులకు బదులివ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ని ట్వీటర్లో సుమారు 73 లక్షల మంది ఫాలో అవుతున్నారు కనుక. వారి విజ్ఞాప్తులకి ప్రధాని నరేంద్ర మోడి సమాధానం ఇవ్వకపోతే వారందరికీ తప్పుడు సంకేతం పంపినట్లవుతుంది. కనుక తప్పనిసరిగా మోడీ ఏదో ఒక సమాధానం చెప్పవలసి ఉంటుంది. కానీ ఆవిధంగా చేస్తే ఇకపై రోజూ ఇదే ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కనుక జవాబు ఇచ్చే ముందు చాలా ఆలోచించక తప్పదు.