మనీ లాండరింగ్ మరియు అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వీర్ భద్ర సింగ్ కి చెందిన సుమారు 8 కోట్లు విలువయిన ఆస్తులను ఈడి అధికారులు నిన్న తాత్కాలికంగా జప్తు చేసారు. ఇదివరకు ఆయన కుమార్తె పెళ్లి జరుగుతున్న సమయంలో సిబీఐ ఆయన కేసు నమోదు చేసింది. ఇప్పుడు హోలీ పండుగ రోజున ఈడి తన ఆస్తులను జప్తు చేయడం రాజకీయ కక్ష సాధింపేనని వీర్ భద్ర సింగ్ ఆరోపించారు. డిల్లీలోని గ్రేటర్ కైలాష్ అనే పోష ఏరియాలో ఆయన భార్య పేరిట ఉన్న ఒక ఫ్లాట్ ని నిన్న ఈడి అధికారులు జప్తు చేసారు. దాని విలువ కనీసం రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం. అదికాక వారి పేరిట ఉన్న రూ. 2.5 కోట్లు విలువున్న బాండ్లు వగైరాలను కూడా ఈడి అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. భాజపా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, కానీ తను అటువంటి వాటికి భయపడేది లేదని వీర్ భద్ర సింగ్ చెప్పారు.
ముఖ్యమంత్రి వీర్ భద్ర సింగ్ రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయడానికి ఒక పారిశ్రామిక వేత్త నుంచి భారీగా లంచాలు పుచ్చుకొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ పారిశ్రామికవేత్త స్వయంగా ఆవిషయం మీడియాకి తెలియజేయడం సంచలనం సృష్టించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, సిబీఐ, ఈడీ సంస్థల నుంచి నోటీసులు అందుకొంటున్న కారణంగా ఆయన స్వయంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, కేసులను ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకొన్నా బాగుండేది లేకపోతే కాంగ్రెస్ పార్టీ అయినా ఆయనని ఆ పదవి నుంచి తప్పించినా బాగుండేది. అలాగా చేయకుండా మోడీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపులకి పాల్పడుతోందని చెప్పుకోవడం, ప్రజలను మభ్యపెట్టేందుకు ఆయన వంటి రాజకీయనేతలు రోటీన్ గా పాడే పాటేనని భావించవలసి ఉంటుంది.