తెలంగాణా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కటి వాతావరణం కల్పించిందని ప్రధాని నరేంద్ర మోడి ఒక సమీక్షా సమావేశంలో స్వయంగా మెచ్చుకొన్నారు. ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి అనుమతులు సాధించుకోవడానికి తెలంగాణా ప్రభుత్వం చాలా చక్కగా కృషి చేస్తోందని మెచ్చుకొన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సంతోషిస్తూ, “సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడి మా ప్రభుత్వ కృషిని, ప్రభుత్వ విధానాలను మెచ్చుకొంటూ మాట్లాడటం సాదారణమయిన విషయమేమీ కాదని మేము భావిస్తున్నాము. మా ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రప్రభుత్వం కూడా గుర్తించిందని దీనితో స్పష్టమయింది. ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్ లో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. బహుశః అది గమనించే ప్రధాని ఆవిధంగా అని ఉండవచ్చును. ఏమయినప్పటికీ ప్రధాని నోట మా ప్రభుత్వం గురించి ఒక మంచిమాట వినడం మాకు చాలా ఆనందం కలిగిస్తోంది,” అని కేసీఆర్ అన్నారు.
భారతదేశంలో గుజరాత్ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమలకి, వ్యాపారానికి అనుకూలంగా ఉందని కొన్ని నెలల క్రితం ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికలో పేర్కొంది. అప్పటికే చాలా అభివృద్ధి సాదించిన హైదరాబాద్ గురించి అందులో పేర్కొనకపోవడంతో తెలంగాణా ప్రభుత్వాధినేతలు కొంచెం బాధ పడ్డారు. తమ చేతలే తమకు గుర్తింపు తెస్తాయని అప్పుడు మంత్రి కె.టి.ఆర్. చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోడి గుర్తించి ప్రశంసించారు. రెండేళ్ళ వ్యవధిలోనే తెలంగాణా ప్రభుత్వం ఈవిధంగా మంచి విధానాలతో ముందుకు సాగుతూ పురోగతి సాధించి, ప్రధాని నుండి ప్రశంశలు అందుకోవడం చాలా అభినందనీయం. ఇది తెలంగాణా ప్రజలందరి విజయమనే చెప్పవచ్చును.