రంగురంగుల సిటి కల్చర్ లో భాగంగా రోజువారీ వ్యాపకాలతో పోలికలు లేని అతి ఉల్లాసభరితమైన ”పేజ్ త్రీ” లైఫ్ హోలీ నాడు ఆంధ్రప్రదేశ్ లో ఒక అడుగు పెట్టేసింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ నగరాలకే పరిమితమైన ”రంగ్ బర్సే” రాష్ట్రం విడిపోయాక కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం మొదలైన పెద్దపట్టణాల్లోకూడా మొదటి సారి పెద్ద ఫెస్టివల్ అయ్యింది.
దివాన్ చెరువు దగ్గర ఎంఎఫ్ కన్వెన్షన్ హాల్ లో ఒక వ్యాపార సంస్ధ నిర్వహించిన రంగ్ బర్సే లో ఆసంస్ధ సభ్యులు, వారి మిత్రులు కుటుంబాల తో సహా పాల్గొని రంగుల వానలో తడుస్తూ పది వేల వాట్ల మ్యూజిక్ కి అనుగుణంగా గంటల తరబడి డాన్సులు చేశారు. ట్రాక్టర్ ట్యాంకర్ లో నీటిని పైనుంచి స్ప్రే అయ్యేలా కృత్రిమ వర్షాన్ని సృష్టించారు. ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం వున్న వేడుక ఖర్చు మొత్తం నిర్వాహక సంస్ధే భరించింది.
రాజమహేంద్రవరంలో చెరుకూరి కన్వెన్షన్ హాల్ లో ముగ్గురు ఔత్సాహిక యువతులు నిర్వహించిన ఇదే సందడి చూపరులకు విశేషమైన కుతూహలాన్ని కలిగించింది. ఈ రంగ్ బర్సేలో పార్టిసి పెంట్స్ కి 500 రూపాయల ఎంట్రీ ఫీజు పెట్టారు. ఒక మెడికల్ కాలేజి, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వున్న ఈ నగరంలో రంగుల వసంతంలో చిందులేసే యువతీ యువకుల ఉత్సాహానికి లోటు లేదు.
కెమికల్స్ లేని టమోటా లు నీళ్ళ బెలూన్లు ఒకరిమీద ఒకరు పేల్చుకుంటూ సురక్షితమైన హోలీ ఆట ఆడారు.
ఉత్తరాదివారి హోలీ మార్వాడీ కుటుంబాల వల్ల దేశమంతటా వ్యాపించింది. సాంప్రదాయికంగా జరిగే హోలీ వేడుక ఇపుడు కమర్షియల్ ఈ వెంటుగా రూపాంతరం చెందుతోంది. రాజమహేంద్రవరంలో రెండు రంగ్ బర్సే లలో ఒక ఈవెంటు కి తక్షణవ్యాపార ప్రయోజనం ఆశించని స్పాన్సరర్లు వున్నారు. హోలీ వేడుకలకు అన్ని సదుపాయాలూ సమకూర్చి పార్టిసిపెంట్ల ఫీజులో ఖర్చులుపోగా కొంత లాభం ఆశించే రెండవ ఈవెంటుని నిర్వహించారు.
ఇలాంటి అన్ని హుషారులకూ మహా నగరమైన హైదరాబాదే వేదిక. జీవనశైలిలో ఉత్సాహాలు, ఉల్లాసాలు సంపన్న వర్గాలనుంచి దిగువ మధ్యతరగతి ఆదాయవర్గాల వారి వరకూ దిగిరావడమే హోలీ వేడుక ఒక కోలాహలంగా మారిపోతూండటానికి మూలం.
ప్రతికోలాహలమూ ఏ కొందరికైనా ధన ఆర్జిత సేవే అవుతుంది. రవాణా, కేటరింగ్, సాఫ్ట్ డ్రింకులు, ఎలక్ట్రిక్ జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు, డిజిటల్ సౌండ్ సిస్టమ్స్…ఇలా ఈవెంటుతో ముడిపడి వున్న ప్రతీ సప్లయ్ కీ చేసే చెల్లింపులన్నీ ఆయా రంగాల్లో పని చేసిన ఎందరికో ఆదాయాలు అవుతాయి.స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అన్నట్టు ”ఇలాంటి ఈవెంట్లు అన్నీ సర్వీసు సెక్టార్ కి ఇన్ కమ్ జనరేట్ చేసే ఎకనమిక్ స్టిమ్యులేటర్లే”!
”రాజమహేంద్రవరంలో ఉత్సాహానికి లోటు లేదు. అయితే డాన్స్ ద్వారా ఉత్సాహాన్ని వెలిబుచ్చగల, ఉల్లాసాన్ని పంచుకోగల కల్చర్ రాబోయే కాలంలో తప్పక వస్తుంది” అని ఈ వెంటు నిర్వహించడానికి చెన్నైనుంచి వచ్చిన ఒక డిజె (డిస్క్ జాకీ) చెప్పింది. రికార్డెడ్ మ్యూజిక్ ని మిక్స్ చేస్తూ, షఫుల్ చేస్తూ గోలగోలగా కామెంట్లు విసురుతూ ”కిర్రాకు పుట్టించావే” అన్నంతగా యువతులైన ఇద్దరూ డిజెలూ ఈవెంట్లను హుషారెక్కించారు.
ఈవెంటు ఒకఎత్తయితే వాటిని సౌకర్యంగా, సురక్షితంగా, ప్రయివెసీకి భంగం కలుగని విధంగా పూర్తి చేసుకోడానికి ఇవెంటు సెంటర్లే పెద్ద ఇన్ ఫ్రాస్ట్రక్చర్లు. వీటికైతే ఆంధ్రప్రదేశ్ లో లోటులేదు. చిన్న పెద్ద పట్టణాల్లో కూడా పేజ్ త్రీ కల్చర్ అడుగు పెడుతోందంటే ఈ ఇన్ ఫ్రా కూడా అందుకు ఒక కారణమే!