జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పీపుల్స్ డెమొక్రేటిక్ పార్టీ (పిడిపి) పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ, ప్రధాని నరేంద్ర మోడితో చర్చించిన తరువాత భాజపాతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దం అవడంతో, ఆమెను పిడిపి ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా అంటే తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నుకొన్నారు. ఆమెకు మద్దతు ఇచ్చి రాష్ట్రంలో మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు భాజపా కూడా సిద్దంగా ఉంది. కనుక ఇవ్వాళ్ళ మహబూబా ముఫ్తీ, రాష్ట్ర భాజపా నేతలు గవర్నర్ ఎన్.ఎన్.వొహ్రాని కలవబోతున్నారు. ఆయనని కలిసిన తరువాత మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం ఎప్పుడు చేస్తారో స్పష్టమయ్యే అవకాశం ఉంది. బహుశః రెండు మూడు రోజులలోనే ఆ కార్యక్రమం ఉండవచ్చును. సుమారు మూడున్నర నెలల తరువాత సరిహద్దు రాష్ట్రమయిన జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటవుతోంది.