వైకాపా ఎమ్మెల్యే రోజా తన సస్పెన్షన్ వ్యవహారం గురించి మీడియాతో మాట్లాడుతూ “నేను కాల్ మనీ-సెక్స్ రాకెట్ గురించి శాసనసభలో చర్చించాలని పట్టుబట్టినపుడు, దానిపై చర్చకు అనుమతిస్తే తెదేపా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతోనే డా. అంబేద్కర్ పై చర్చను ప్రారంభించేరు. శాసనసభ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహంపై కాకి రెట్టలు, ఆయన మెడలో వాడిపోయిన ఓ పూల దండ ఉన్నాయి. తెదేపాకు ఆయనపై గౌరవం లేదని చెప్పడానికి అదే చక్కని నిదర్శనం. సభలో కాల్ మనీ వ్యహారంపై చర్చ జరపకుండా తప్పించుకొనేందుకే డా. అంబేద్కర్ పై చర్చ మొదలుపెట్టింది. కాల్ మనీపై చర్చకు పట్టుబట్టినందుకే నన్ను ఏడాదిపాటు సస్పెండ్ చేసింది,” అని రోజా ఆరోపించారు.
ఆమె ఆరోపణలను తెదేపా అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు తప్పు పట్టారు. “డా. అంబేద్కర్ 125 వ జయంతి సభలో చర్చ జరుగుతుంటే ఆ రోజు సభలో రోజా ఆ చర్చ జరగకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించి చాలా తప్పు చేసారు. అంతేకాక సభలో దళిత మహిళా ప్రతినిధుల పట్ల చాలా చులకనగా మాట్లాడారు. కాల్ మనీ వ్యవహారంపై సభలో చర్చ జరగకుండా చేసేందుకే డా. అంబేద్కర్ పై చర్చ మొదలుపెట్టామని ఆమె ఆరోపించడం దళిత, బడుగు, బలహీన వర్గాలను, ఆయనను కూడా అవమానించినట్లే. వైకాపా నేతలు డా. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తామని చెప్పి లీటరు పాలు పట్టుకొని వెళ్లి అందులో సగం కూడా పోయలేదని తెలిసింది. డా. అంబేద్కర్ పట్ల ఆవిధంగా మాట్లాడినందుకు రోజా బేషరుతుగా క్షమాపణలు చెప్పుకొంటే మంచిది,” అని అన్నారు.