అఖిల్ తన రెండో సినిమా విషయంలో పిచ్చ పిచ్చగా ఆలోచించేస్తున్నాడు.చాలామంది దర్శకుల్ని పిలిపించుకొని కథలు విన్నాడు. ఆఖరికి వంశీపైడిపల్లినీ లైన్లో పెట్టాడు. కానీ.. ఏదో ఓ మూల అనుమానం. వంశీ యాక్షన్ డ్రామాల్ని బాగా తీయగలడు. అఖిల్‌తో తాను చేసింది అదే. ఏజ్ చిన్నది.. బిల్డప్ పెద్దది అనిపించింది. వంశీని ఎంచుకొని మళ్లీ అదే తప్పు చేస్తున్నానా అనే భావన వెంటాడింది. పైగా వంశీ తన సినిమాల్ని బాగా లేట్ చేస్తాడు. అందుకే వంశీ పైడిపల్లి విషయాన్ని పెండింగ్‌లో పెట్టాడు.
ఇప్పుడు ఊపిరి విడుదలైంది. అన్నిచోట్లా.. అందిరినోటా సూపర్ హిట్ టాక్ అందుకొంటోంది. అందుకే… అఖిల్‌కీ ఓ ధీమా వచ్చేసింది. హిట్ సినిమా దర్శకుడి చేతిలో పడిపోతే.. బండి సేఫ్ అనే అభిప్రాయానికి వచ్చేసుంటాడు. నాగ్ కూడా.. అఖిల్‌ని వంశీ చేతిలో పెట్టడానికి ఏమాత్రం ఆలోచించడేమో. అందుకే అఖిల్‌కి లైన్ క్లియర్ అయిపోయింది. పైగా అఖిల్ చేతిలో ఉన్నది ఓ రీమేక్ కథ అని తెలుస్తోంది. ఇన్టచ్బుల్స్ ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా మలచిన వంశీ.. ఈ రీమేక్‌కీ న్యాయం చేస్తాడన్న నమ్మకం అఖిల్‌కి కలిగి ఉండొచ్చు. అతి త్వరలోనే అఖిల్ – వంశీల సినిమా న్యూస్ బయటకు వచ్చినా ఆశ్చర్యపడొద్దు.