సినిమా.. ఎన్ని మాధ్యమాలొచ్చినా సగటు మనిషి తనను తాను మర్చిపోయి ఓ రెండున్నర గంటలు హాయిగా ఎంజాయ్ చేసే ఓ ప్రక్రియ. అయితే సినిమాలను బట్టి ఆడియెన్స్ వాటిని రిసీవ్ చేసుకోవడం ఉంటుంది. కొన్ని సినిమాలు నవ్విస్తాయి.. మరికొన్ని సినిమాలు ఏడిపిస్తాయి.. ఇంకా కొన్ని సినిమాలు బరువెక్కిన హృదయాలతో థియేటర్ నుండి ప్రేక్షకులను బయటకు పంపిస్తాయి. సినిమా ఏదైనా ఆడియెన్స్ పొందే అనుభూతిని బట్టే ఆ సినిమా హిట్టా ఫట్టా అన్న లెక్కలు తేలుతాయి.
తెలుగు సినిమా ఈ మధ్య కొత్త నడవడికను ఏర్పరచుకున్నది అన్న మాట వాస్తవం. మూస థోరణి సినిమాలకు చెక్ పెట్టి కుర్ర హీరోలే కాదు స్టార్ హీరోలు కూడా సాహసాలను చేసేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా అంటే ఓ లవ్ ట్రాక్.. దానికి మూడు ఫైట్స్.. ఓ 5,6 పాటలు అనే సూత్రాన్ని వదిలి సినిమా అంటే కథ.. కథనాలు అనే దృష్టి దర్శక నిర్మాతలకు కలగడం మంచి విషయం. జానర్ ఏదైనా సినిమా ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడానికే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ఇక ఈమధ్యన వచ్చిన తెలుగు సినిమాలు క్షణం, ఊపిరి సినిమాలు తెలుగు సినిమాను మరో కొత్త జోష్ ను ఇచ్చాయని చెప్పాలి. కేవలం హీరో ఇమేజ్ తోనే సినిమా ఆడుతుంది అన్న ప్రమాణాలు మానేసి.. హృదయానికి హత్తుకునే సన్నివేశాలు.. ప్రేక్షకులను సీట్స్ లో కూర్చో పెట్టగల కథ కథనాలు ఉంటే సినిమా హిట్ అని నిరూపిస్తున్నారు. అలాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు కూడా. మరి అతి కొద్దికాలంలో వచ్చిన ఈ మార్పు తెలుగు సినిమా స్థాయిని పెంచాయనే చెప్పాలి. సో దర్శక నిర్మాతలు ఇంకా తమ సృజనను పెంచుకుని సరికొత్త కథ కథానాలతో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకుల ముందు తీసుకొచ్చి వారెవా అనిపించాలని కోరుకుందాం.