మన దేశంలో న్యాయవ్యవస్థ అత్యంత విశిష్టమైనది. ఎంతగా అంటే, ఏ ఒక్క అమాయకునికీ, కేసుతో సంబంధంలేని వ్యక్తికి శిక్షపడకూడదన్నంత ఉదారమైనది. పది మంది నేరగాళ్లు తప్పించుకున్నా ఫర్వాలేదుగానీ అమాయకునికి శిక్ష పడకూడదన్న మానవతావాదం మనదేశ నేరన్యాయవ్యవస్థలో మమేకమైఉంది. ఇంతవరకూ బాగానేఉంది. కానీ దీన్ని ఆసరా తీసుకుని కరడుగట్టిన నేరస్థులు, హంతకులు, చివరకు ఉగ్రవాదులు కూడా తప్పించుకోవడానికో లేదా, కొంతలోకొంత ఊరట దారులు వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, 1993నాటి ముంబయి ఉగ్రవాద దాడిలో 257 మంది నిండుప్రాణాలు బలైపోయాయి. అంతేకాదు, వందలాది మంది గాయపడ్డారు. ఇప్పటికీ ఆ వరుస బాంబుప్రేలుళ్ల భయానక సంఘటనకు మనసుచెదరినవాళ్లు ఎందరో ఉన్నారు. బాధితులు ఇప్పటికీ ఈ సంఘటన పేరు చెప్పగానే ఉలిక్కిపడుతునే ఉన్నారు. అంతటి భయానక ఉగ్రవాద కేసులో చివరకు ఉరిశిక్ష పడిన దోషి – యాకూబ్ రజాక్ మెమన్. అతని ఉరిశిక్ష అమలు ఈనెల 30వ తేదీన.
న్యాయనిపుణులు చెబుతున్నదేమిటంటే, అన్నీ సక్రమంగా సాగితే ఉగ్రవాది యాకూబ్ జులై 30న ఉరికంబం ఎక్కుతాడని. దీని అర్థం ఏమిటి? ఉగ్రవాదికి ఉరిశిక్ష పడినా , క్యూరేటివ్ పిటీషన్ ని సుప్రీం కోర్టు కొట్టేసినా, ఉరిశిక్ష అమలుకు డేట్, టైమ్ ఫిక్స్ అయినా ఇంకా ఏవో అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? అంతా సక్రమంగా జరిగితే…అన్న డౌట్ ఎందుకు వస్తున్నది? ఈ ప్రశ్నలు నాటి భయానక సంఘటన బాధిత కుటుంబాలకే కాదు, ఉగ్రవాదిని ఉరివేయాల్సిందేనని కోరుకుంటున్న ప్రతిఒక్కరినీ కలవరపరుస్తున్నాయి. జులై 30న ఉరికొయ్యకు వ్రేలాడతాడనుకునే పరమ కర్కోటకడు తన శిక్షను తగ్గించుకునే అవకాశం లేదా వాయిదా వేసుకునే అవకాశం ఇంకా ఉన్నదా…? అదేలా సాధ్యమన్న విషయంపై అంతా తర్జనభర్జన పడుతున్నారు.
ఉగ్రవాది యాకూబ్ ఉరిశిక్షను తప్పించుకునే దారులు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయన్నది న్యాయవిశ్లేకులు వాదన. ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం, అతనికి మిగిలిన దారులు ఇవి….
మొదటి దారి:
ఉగ్రవాది యాకూబ్ ఇప్పుడు తాను స్వయంగా మహారాష్ట్ర గవర్నరుకు క్షమాభిక్ష విజ్ఞాపన సమర్పించడంద్వారా ఊరట పొందే అవకాశం లేకపోలేదు . గతంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనే ఇతనికి క్షమాభిక్ష ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. అయితే మరి ఇప్పుడీ ఆశ ఏమిటి ? ఇక్కడో చిన్న మెలిక ఉన్నదంటున్నారు న్యాయ నిపుణులు. గతంలో రాష్ట్రపతి తిరస్కరించిన క్షమాభిక్ష పిటీషన్ ను యాకూబ్ స్వయంగా పెట్టుకున్నదికాదు, ఇది అతని సోదరుడు పెట్టుకున్నది. ఇక ఇప్పుడు యాకూబ్ స్వయంగా అర్జీ సమర్పించడంద్వారా వెసులుబాటు రావచ్చు. ఎందుకంటే దరఖాస్తు పరిశీలనలో ఉన్నప్పుడు శిక్ష అమలు చేయడం కుదరదన్న వాదన ఒకటి వినబడుతోంది.
రెండవ దారి :
యాకూబ్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటీషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసి ఉరిశిక్ష అమలు చేయాల్సిందేనంటూ తీర్పు చెప్పింది జూలై 21న. క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరణకు, ఉరి శిక్ష అమలకు కనీసం 14 రోజులు గడవుఉండాలంటూ ఇదే అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పుని దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈనెల 30న ఉరితీత సాధ్యం కాకపోవచ్చేమో. అంటే ఉగ్రవాది మరణ ముహూర్తం వాయిదా పడే అవకాశం ఇలాకూడా ఉండవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు.
మూడవ దారి :
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీలకు మరణదండన విధించడం సరైన పద్ధతి కాదని కూడా గతంలో సుప్రీం కోర్టు ఒక కేసులో తీర్పు చెప్పింది. ఆ తీర్పుని ఆధారంగాచేసుకుని చూసినా ఈ ఉగ్రవాదికి మరోదారి మిగిలే ఉంటుందని అంటున్నారు.
ఇవి కాక మరికొని మార్గాలు కూడా అతణ్ణి వెంటనే ఉరితీయకుండా ఉంచగలవని న్యాయనిపుణులు చెబుతున్నారు. మనదేశ నేర న్యాయవ్యవస్థలోని విశిష్టత అమాయకులను శిక్ష బారినుండి తప్పించడానికేకాకుండా. ఒక్కోసారి కరడుగట్టిన నేరస్థులు తప్పించుకోవడానికీ, లేదా ఊరట పొందడానికి సాయపడుతుందేమోనన్నభయాలు లేకపోలేదు. ఇప్పుడు యాకూబ్ విషయంలో అదే జరుగుతుందేమోనన్న ఆందోళన ఉగ్రవాదాన్ని ఏవగించుకుంటున్న అందరిలో కలగడం సహజం. అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేసినా, రాష్ట్రపతి అంతటి మహోన్నత వ్యక్తి క్షమాభిక్ష పిటీషన్ ను త్రోసిపుచ్చినా ఇంకా ఏవో మార్గాలు ఉగ్రవాది ప్రాణాలు కాపాడతాయన్న చేదు నిజాన్ని సామాన్యులు , అందునా బాధిత కుటుంబాలు అర్థంచేసుకోలేక మౌనంగా రోదిస్తున్నాయి. ఇప్పుడు అంతా జులై 30 వ తేదీనాటి ఉరితీత వార్త కోసమే ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ సహా మరి కొన్ని నగరాల్లో హైఅలెర్ట్ కూడా ప్రకటించారు. మరి చివరకు ఎలాంటి వార్త వింటామో…
– కణ్వస
kanvasa19@gmail.com