కేరళకు చెందిన ఫాథర్ ఉజునలిల్ టామ్ అనే మతగురువును ఐసిస్ ఉగ్రవాదులు యెమెన్ లో ఒక వృద్ధాశ్రమం నుంచి మార్చి 4వ తేదీన కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృవీకరించారు. అయనిని వారి చేర నుంచి విడిపించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని ఆమె ట్వీటర్ సందేశం ద్వారా తెలిపారు.
ఐసిస్ ఉగ్రవాద సంస్థకి అనుబంధ సంస్థగా చెప్పబడుతున్న ‘డెయ్ ష్’ కి చెందిన నలుగురు ఉగ్రవాదులు ఈనెల 4న యెమెన్ దేశంలోని ఎడెన్ అనే ప్రాంతంలో ఉన్న ఒక వృదాశ్రమంలో చొరబడి అందులో ఉన్న నలుగురు భారతీయులను, యెమెన్ దేశానికి చెందిన ఇద్దరు మహిళా నర్సులని, 8 మంది వృద్ధులను, ఒక సెక్యూరిటీ గార్డుని అతి కిరాతకంగా కాల్చి చంపిన తరువాత, కేరళకు చెందిన ఫాథర్ ఉజునలిల్ టామ్ ని తమతో తీసుకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన ఆచూకి తెలియలేదు. నిన్న గుడ్ ఫ్రై డే సందర్భంగా ఐసిస్ ఉగ్రవాదులు ఆయన చంపబోతున్నారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడంతో అందరూ చాలా కలవార పడ్డారు. అయితే నిన్న ఆయనను చంపినట్లు ఐసిస్ ఉగ్రవాదులు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో, ఆయన ఇంకా సజీవంగానే ఉన్నారని అందరూ భావిస్తున్నారు. ఆయనను ఉగ్రవాదుల చెర నుంచి విడిపించేందుకు యెమెన్ లోని భారత దౌత్యాధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. అయితే ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో చిక్కినవారు చాలా అరుదుగా ప్రాణాలతో బయటపడతారని అందరికీ తెలుసు. గత ఏడాది వారి చేతికి చిక్కిన ఇద్దరు ఆంధ్రా ప్రొఫెసర్ల ఆచూకి ఇంత వరకు తెలియలేదు. వారిని విడిపించదానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. కనుక వారు ఇంకా సజీవంగా ఉన్నారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ కేరళకు చెందిన ఫాథర్ ఉజునలిల్ టామ్ వారి చెరలో చిక్కుకొన్నారు. ఆయనని ఎక్కడ ఉంచారో? సజీవంగా ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు.