“రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో చిక్కుకొంది…ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంది…కేంద్రప్రభుత్వమే రాష్ట్రాన్ని ఆదుకోవాలి…” ఈ మాటలు తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోట వింటూనే ఉంటాము. ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికే కష్టంగా ఉన్నప్పుడు, ప్రజా ప్రతినిధులకు జీతభత్యాలు పెంచగలదని ఊహించలేము కానీ అందుకు రంగం సిద్దం అవుతోంది.
ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవం నుంచి మొదలయిన ఆర్భాటపు ఖర్చులు రాజు వెడలె రవి తేజము లరియగ అన్నట్లుగా ఓ డజను మంది మార్భలంతో ముఖ్యమంత్రి చేస్తున్న విదేశీయాత్రల వరకు అన్నీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా సజావుగా సాగిపోతూనే ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి బీద అరుపులు అబద్దమనుకోవాలా లేకపోతే ప్రభుత్వం చేతిలో డబ్బు లేకపోయినా ఏదో విధంగా డబ్బు సమకూర్చుకొంటూ విచ్చల విడిగా దుబారా ఖర్చులు చేస్తోందనుకోవాలా? అని ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాజెక్టుల కోసం ప్రజాధనం విచ్చల విడిగా దుబారా చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా పట్టించుకోవడం లేదు. అసలు వారి విమర్శలను ఖాతరే చేయడం లేదు.
ఇప్పుడు మరో భారీ ఖర్చుకి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. అదే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాల పెంపు. అందుకోసం శాసనసభ సౌకర్యాల కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదికను శనివారంనాడు అందజేసింది. మిగిలిన ఏ విషయంలోనయినా విభేదించే ఎమ్మెల్యేలు జీతభత్యాల పెంపు విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు కనుక వారి జీతాలు కమిటీ సిఫార్సు మేరకు రెట్టింపు కావడం ఖాయమేనని భావించవచ్చును.
నివేదికలో ఏమని సిఫార్సులు చేసారంటే: ప్రస్తుతం ఎమ్మెల్యేలకి నెలకి ఇస్తున్న రూ.90, 000 జీతాన్ని రూ.1.5 లక్షలకు పెంచాలి. దానికి అధనంగా రూ. 50,000 ఇంటి భత్యం (హెచ్.ఆర్.ఏ.), కారు రుణం రూ.40 లక్షలు, స్టేషనరీ కోసం ఐదేళ్ళకి రూ. 1 లక్ష ఇవ్వాలి. ఇవికాక యధావిధిగా పెట్రోల్ అలవెన్స్, టెలీఫోన్ అలవెన్స్ వగైరా ఇవ్వాలి.
ఈ రోజు శాసనసభలో విద్యుత్ సంస్కరణలు, చార్జీల పెంపుపై వాడిగా వేడిగా సాగింది. అయితే ఆ కారణంగా ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచకుండా ఉండదని అందరికీ తెలుసు. ఇక నెలకీ రెండు నెలలకీ ఓసారి పెరిగే పెట్రోల్, డీజిల్ ధరలు, తత్ఫలితంగా పెరిగే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు వంటివన్నీ సామాన్యుల జీవితాలను రోడ్డు మీదకు ఈడ్చే పరిస్థితులు కల్పిస్తుంటే, ప్రజాసేవ చేస్తామని పోటీ పడుతున్న ప్రజాప్రతినిధులు మాత్రం తమకు కావలసినంత జీతభత్యాలు చేసుకొని విలాసంగా జీవిస్తున్నారు. ప్రతీ చిన్న సమస్యపై ప్రభుత్వంపై కత్తులు దూసే ప్రతిపక్ష పార్టీలు ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రభుత్వంతో నిసిగ్గుగా చేతులు కలుపుతాయి. అయినా ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయత. ప్రశ్నిస్తానన్న పెద్దమనిషి ఇదేమి అన్యాయమని ప్రశ్నించడు!