వారం రోజుల వ్యవధిలో వైకాపా రెండు సార్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టింది. కానీ రెంటినీ తెదేపా సమర్ధంగా తిప్పికొట్టింది. వాటి ఉద్దేశ్యం ప్రభుత్వాన్నో, స్పీకర్ కోడెల శివప్రసాద రావునో తొలగించాలని కాదు…తమ పార్టీలో నుంచి వైకాపాలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికేనని జగన్మోహన్ రెడ్డి స్వయంగా శాసనసభలో ప్రకటించుకొని మరింత చులకనయ్యారు. నిజానికి ఫిరాయింపులు ప్రోత్సహించినందుకు, పార్టీలో చేరిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించనందుకు తెదేపా సిగ్గుతో తలవంచుకోవాలి. కానీ జగన్ సభలో తలవంచుకోవలసి వచ్చింది. అది స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు. అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో, అటువంటి అనైతికమయిన పని చేసి కూడా తెదేపా వైకాపాపై గొప్ప విజయం సాధించినట్లు భావిస్తోంది. మీడియా కూడా అలాగే వర్ణిస్తోంది.
ఫిరాయింపులు ప్రోత్సహించి తెదేపా తప్పు చేస్తే, శాసనసభలో తమకు తగినంత బలం లేదని తెలిసి కూడా ఒక ప్రయోజనం ఆశిస్తూ మరో దాని కోసమని అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి వైకాపా తప్పు చేసింది. రోజా సస్పెన్షన్ వ్యవహారంలో కూడా రెండు పార్టీలు మళ్ళీ అలాగే తప్పులు చేసాయి. తెదేపా ఒకమెట్టు దిగి తన తప్పును సరిదిద్దుకొనేందుకు సిద్దపడింది కానీ క్షమాపణ చెపితే తప్పు చేసినట్లు ఒప్పుకొన్నట్లవుతుంది కనుక రోజా అందుకు అంగీకరించలేదు. పైగా న్యాయపోరాటానికి సిద్దం అని చెపుతున్నారు. సాంకేతికంగా అది సహేతుకంగానే కనిపిస్తున్నప్పటికీ, గోటితో పోయే దానిని గొడ్డలి వాడుతున్నట్లుందది. ఇన్ని వరుస తప్పులు జరిగిన తరువాత కూడా రెండు పార్టీలు వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేకపోవడం విస్మయం కలిగిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, తెదేపా నేతలు అందరూ “తెదేపా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పనులను చూసి రాష్ట్రంలో ప్రజలందరూ ప్రభుత్వం పట్ల పూర్తి నమ్మకం కలిగి ఉన్నారని” నిత్యం కోరస్ గా పాట పాడుతుంటారు. అదే నిజమయితే, తెదేపాలో చేరిన వైకాపా ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి, మళ్ళీ ఉపఎన్నికలకు వెళ్లి, ఆ సీట్లను దక్కించుకొని ఉండి ఉంటే తెదేపాకు గౌరవంగా ఉండేది, వైకాపాకు సత్తా ఏమిటో కూడా తెలిసి ఉండేది. కానీ ఆవిధంగా చేయకుండా ఏదో ఒక సాకుతూ వైకాపా వరుసగా జారీ చేస్తున్న విప్ ల భారీ నుంచి ఏవిధంగా వారిని కాపాడుకోవాలాని ప్రతివ్యూహాలు రచిస్తోంది. అలాగే వైకాపా కూడా వారిపై అనర్హత వేటు కోసం నేరుగా ప్రయత్నాలు చేయకుండా డొంకతిరుగుడు విధానం అవలంభిస్తూ పదేపదే తెదేపా చేతిలో భంగపడుతోంది.
ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో చర్చ జరిగినప్పుడు ఆ 8 మందితో సహా వైకాపా ఎమ్మెల్యేలు అందరూ తప్పనిసరిగా సభకు హాజరు కావాలని, దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైకాపా తాజాగా మరొక విప్ జరీ చేసింది. ఎందుకయినా మంచిదని స్పీకర్ కోడెల శివప్రసాద రావుకి కూడా ఆ విషయం తెలియజేస్తూ ఒక లేఖ వ్రాసింది. దానిలో తమ పార్టీ టికెట్ పై ఎన్నికయిన ఎమ్మెల్యేల జాబితాను కూడా పేర్కొంది. మరో లేఖలో ఆ బిల్లుపై తప్పనిసరిగా సభలో (డివిజన్) ఓటింగ్ చేపట్టాలని కోరింది. అంటే వైకాపా మళ్ళీ అదే పొరపాటు చేయడానికి సిద్దం అవుతోందని స్పష్టం అయ్యింది. పైకి అది చెపుతున్న కారణం: తెదేపా ప్రభుత్వం సమర్పిస్తున్న ద్రవ్య వినిమయ బిల్లుని వ్యతిరేకించడం కానీ దాని అసలు ఉద్దేశ్యం ఆ 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం. అది ఈ ఎత్తు వేసింది కనుక తెదేపా కూడా తప్పకుండా దానికి పైఎత్తు వేస్తుంది. అంటే మళ్ళీ అది కూడా మరో తప్పు చేయబోతోందని స్పష్టం అవుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా చట్ట సభలలో ప్రజా సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేయకుండా, తమ రాజకీయ చదరంగానికి శాసనసభను వేదికగా మార్చేయడం చాలా విచారకరం.