‘వెళ్లిపోయే వాళ్ల గురించి మాట్లాడుకోవడం అనవసరం’ అని ప్రధాన ప్రతిపక్షనేత జగన్మోహనరెడ్డి చాలా సందర్భాల్లో ధీమా వ్యక్తం చేస్తుంటారు. కానీ.. వెళ్లిపోయే వాళ్ల గురించి.. రాయబారాలు కూడా అనవసరం అని మాత్రం అనుకోరు. ఎందుకంటే ‘అందితే జుట్టు అందకుంటే కాళ్లు’ అనే సిద్ధాంతానికి ఆయన అతీతులేమీ కాదు. తన పార్టీనుంచి వెళ్లే అవకాశం లేదనుకునే వారి పట్ల నిర్లిప్తంగా వ్యవహరించడమూ, వెళ్లిపోతారని సంకేతాలు వచ్చిన తర్వాత వారిని బుజ్జగించడానికి ప్రయత్నించడమూ ఇలాంటి బూజుపట్టిపోయిన పాత చింతకాయ పచ్చడి రాజకీయ టెక్నిక్కులనే ఆయన అనుసరిస్తున్నారు తప్ప.. ఒక నవతరం యువనాయకుడిగా కొత్త తరహా రాజకీయ ఎత్తుగడలను రుచిచూపించడం లేదు. అందుకే బహుశా ఆయన వ్యూహాలు కూడా బెడిసికొడుతున్నాయేమో..! తాజాగా పీఏసీ ఛైర్మన్ ఎంపిక అనే వ్యవహారం ద్వారా తన సొంత పార్టీలో ముసలం పెట్టుకున్న జగన్.. దాని తాలూకు ఫలితాలను అనుభవించే పరిస్థితి ఏర్పడినట్లుగా కనిపిస్తోంది.
పీఏసీ ఛైర్మన్గా బుగ్గన రాజేంద్రనాధ్రెడ్డిని జగన్ ఎంపిక చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కేవలం కులం మాత్రమే కాకుండా, సీనియారిటీ కూడా పుష్కలంగా ఉన్న నేపథ్యంలో తనకు ఈ పదవ గ్యారంటీ అనుకున్న జ్యోతుల నెహ్రూ ఆశలు భంగపడ్డాయి. అదను చూసి తెలుగుదేశం పార్టీ కూడా ఎర వేసింది. ఆ బుట్టలో ఆయన పడ్డారు. జ్యోతుల నెహ్రూతో పాటూ తూర్పుగోదావరి జిల్లాకే చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కలిసి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించబోతున్నట్లుగా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. వీరిని వైకాపా అధినేత జగన్ ఏ రకంగానూ నియంత్రించలేని పరిస్థితి కూడా ఏర్పడింది. వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు ఇద్దరూ ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడును కలిశారు. అలవాటుగా పార్టీ ఫిరాయించే ప్రతి ఎమ్మెల్యే ఏం చెబుతారో అదే తరహాలో వీరు కూడా నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడేందుకే మంత్రిని కలిసినట్లుగా వెల్లడించారు.
అయితే వాస్తవానికి అదే జిల్లానుంచి మరో వైకాపా ఎమ్మెల్యే కూడా తెదేపాలో చేరబోతున్నట్లుగా తెలుస్తున్నది. వీరు శాసనసభ సమావేశాలు ముగసిన తర్వాత ఏప్రిల్ 3 , 4 తేదీల్లో తెదేపా తీర్థం పుచ్చుకుంటారనేది ప్రస్తుతానికి ఉన్న సమాచారం. జ్యోతుల నెహ్రూకు పీఏసీ పదవి ఇవ్వకుండా అవమానించినట్లు కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తెదేపాలో చేరిక గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అదే నిజం అవుతోంది. వీరిని బుజ్జగించి, వారికి పార్టీలో ఏం కావాలో ఆ పదవులను సైతం కట్టబెట్టడానికి వైఎస్ జగన్ చేసిన రాయబారాలు కూడా ఫలించలేదని కూడా తెలుస్తున్నది.