తెలుగు సినిమా అంటే ఏముందిలే.. అని పెదవి విరుచుకొనేవాళ్లంతా. పాటలు, ఫైటింగులు, మసాలా సన్నివేశాలు ఇంతే కదా? హీరోయిజం పేరుతో కథానాయకుడు వేసే వెర్రిమొర్రి వేషాలు, కథానాయికతో చేసే కామకేళీ, పంచ్ డైలాగులు ఇంతేగా.. తెలుగు సినిమా! అందుకే తెలుగు సినిమా తెలుగునాట రికార్డు వసూళ్లు సాధించినా.. అవార్డుల విషయంలో వందల కిలోమీటర్ల దూరంలోనే ఉండిపోయిందెప్పుడూ. ఇక జాతీయ అవార్డుల ఊసెత్తితే ఒట్టు. కనీసం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఓ తెలుగు సినిమా నిలిచినా గొప్పగానే ఉండేది. అలాంటిది… ఇప్పుడు బాహుబలి తెలుగు సినిమా కీర్తి బావుటాని విశ్వ వ్యాప్తం చేసింది. ఒక్క సినిమా ఎంత మార్పు తీసుకొచ్చింది?
బాలీవుడ్ సైతం బాహుబలి గురించి మాట్లాడుకొంది. మన సినిమా అక్కడ వంద కోట్లు తెచ్చుకొంది. జాతీయ అవార్డు అంటే.. బాలీవుడ్ కో, లేదంటే మరాఠీ చిత్రాలకే పరిమితం అనుకొంటున్న సందర్భంలో… బాహుబలి సత్తా చాటింది. చాలా కాలం నుంచి ఊరిస్తున్న జాతీయ ఉత్తమ చిత్రం కేటరిగిలో అవార్డును కైవసం చేసుకొంది. బాహుబలి కీర్తి కిరీటంలో ఇదో మెచ్చు తునక మాత్రమే. బాహుబలి తీసుకొచ్చిన, తీసుకొస్తున్న మార్పు అంతా ఇంతా కాదు. తెలుగు దర్శక నిర్మాతల ఆలోచనా ధోరణిని సమూలంగా మార్చేసింది బాహుబలి. సినిమా అంటే ఓ విజువల్ ఫీస్ట్ అనే విషయాన్ని మరోసారి కుండ బద్దలు కొట్టినట్టు చూపించింది. కథలో దమ్ముంటే ఎంత ఖర్చు పెట్టినా తిరిగి రాబట్టే దమ్ముందని నిరూపించింది. అంతేనా..?? విజువల్‌గా తెలుగు సినిమా స్టాండర్డ్స్‌ని ఒకటికి వంద రెట్లు పెంచింది. తెలుగు సినిమా ఇప్పుడు కాస్త కొత్తగా ఆలోచిస్తోందంటే, కొత్త కథలు పుట్టుకొస్తున్నాయంటే, భారీ బడ్జెట్‌తో సినిమాలు తయారవుతున్నాయంటే.. దానికి బాహుబలి ఇచ్చిన హోప్ ఓ కారణం. తెలుగు సినిమా మార్పుకి నాంది పలికిన చిత్రాల్లో బాహుబలి కచ్చితంగా మేటి చిత్రంగా నిలబడిపోతుంది. తెలుగువాళ్లగా మనందరికీ బాహుబలి ఓ గర్వ కారణం.. జయహో బాహుబలి.