శని,ఆదివారాలలో విజయవాడలో వున్నప్పుడు రాజధాని అమరావతి అధికారిక భవన సముదాయ నమూనాల ప్రదర్శన చూసేందుకు వెళ్లాను. విమర్శలు, వివాదాలు ఎలా వున్నా రాష్ట్ర రాజధాని నిర్మాణం చారిత్రిక అవసరం గనక అందరూ ఆహ్వానిస్తారు. అక్కడకు చాలామంది ఆసక్తిగా వచ్చి చూడటం, మాట్లాడుకోవడం, ఫోటోలు తీసుకోవడం కనిపించింది. అయితే అదే సమయంలో పెద్ద హౌటల్లో పెట్టారు గనక రెండే రోజులు ఉదయం పది గంటల నుంచి అయిదు గంటల వరకే సాగుతుంది గనక మరీ ఎక్కువ మంది చూసే అవకాశం లేదు. మామూలు వాళ్లం చూసినా సాంకేతికంగా వాటి మంచి చెడ్డలు చెప్పే పరిస్థితి వుండదు. ఉన్న మేరకు చూస్తే ఎలివేషన్, ఎన్విరాన్మెంట్ కోణాలు తీసుకున్నట్టు కనిపించింది. అయితే ప్రజారాజధాని అంటున్నారు గనక ప్రజల కోసం కేటాయించే భవనాలు స్థలాల వంటివి ఎక్కడా ప్రత్యేకంగా చూపించలేదని నాతోపాటు వచ్చిన మిత్రుడన్నారు. అది నిజమే.
ఒక అపార్ట్మెంట్ లేదా పెద్ద కాలనీ కట్టేప్పుడు ముందుగా ఆకర్షణ కోసం చూపించే నమూనాగా వుంది తప్ప దాని ప్రత్యేకతలేమిటి, పరిపాలనలో ప్రజల సౌలభ్యానికి ఎలా దోహదం చేస్తుంది వంటి అంశాలు అక్కడ చూపడం గాని చెప్పడం గాని లేదు. ప్రభుత్వం తరపున లేదా క్రిడా తరపున కూడా ఎవరూ పెద్దగా వివరిస్తున్నదీ లేదు. లాంఛనప్రాయమైన ప్రజాసందర్శన అభిప్రాయ సేకరణగానే నడుస్తున్నది. ఒకరిద్దరు అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే వారికి పెద్దగా ఆసక్తి లేదు.
పోటీకి వచ్చిన రకరకాల డిజైన్లను మొదట ప్రదర్శించారు. ఎంపిక చేసిన జపాన్ కంపెనీ మ్యాకీ డిజైన్‌ను ఎంపిక చేశారు. అయితే ఇప్పటికీ ల్యాండ్‌మార్క్‌ల వంటివి ఎలా వుండాలో ఖరారు కాలేదు. ప్రజల పునరావాసానికి ఉపాధికి సంబంధించిన అంశాలు కూడా అలాగే వున్నాయి. అవన్నీ ముందుకు నడిస్తేనే నిజంగా రాజధాని మొదలు. ఒక నగరం నిర్మిస్తామని చెప్పి ఇప్పుడు పాలన నివాస సముదాయాలే చూపిస్తున్నారే అని కూడా కొందరు అడిగారు. డిజైన్ ఎక్కడ తీసుకున్నా స్థానికంగా వుండే సాంకేతిక నిపుణులు యువతరంతో కూడా చర్చించితే బావుంటుందని చాలామంది అనుకోవడం వినిపించింది. చతురతకు మారుపేరైన చంద్రబాబు నాయుడు పని జరుగుతుందని కష్టపడుతున్నానని ప్రజలకు చూపించేందుకే ఈ నమూనాల ప్రదర్శన ఏర్పాటు చేశారన్నది మాత్రం స్పష్టం.
ఇదే సమయంలో మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో భూముల అమ్మకం గురించి మాట్లాడారు. ఇందులో స్థానికులకే ప్రాధాన్యత నిస్తామన్నారు. రైతుల నుంచి భూమి తీసుకుని వాణిజ్య వర్గాలకు అమ్మడం జరిగితే అది కొత్త అనుభవమే. ఆదాయం కోసం వినోద కేంద్రాలు, ప్లాజాలు పార్కులు మాల్స్ వంటివాటికే విశాల స్థలాలు కేటాయించి ప్రజావసరాలను విస్మరిస్తే అప్పుడది వాణిజ్య రాజధాని అవుతుంది గాని ప్రజా రాజధాని కాదు!