సినిమా.. కొందరు ఏదో చేద్దామాని ఏదో చేయబోయి సినిమా రంగంలోకి వస్తే.. మరికొందరు మాత్రం కేవలం సినిమా కోసమే పుట్టి సినిమా కోసమే పనిచేయడానికి వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వారికి సినిమాలు చేయడం తప్ప ఇక వేరే పని ఏది రాదు అన్నంత విధంగా ఉంటుంది. ఓ సినిమా రెండున్నర గంటల సమయం.. 24 విభాగాల్లో పనిచేసే శ్రామికుల కష్టం, ఓ హీరో తన ఫ్యూచర్ డిసేడ్ చేసుకునే అస్త్రం, ఓ హీరోయిన్ తన కెరియర్ మీద ఆశలను పెంచుకునే నేస్తం, ఓ నిర్మాత డబ్బులు సంపాధించాలనే కోరిక, చివరగా ఓ దర్శకుడి దృశ్య కావ్యం ఇవన్ని కలిపితే ఓ సినిమా.
రచయిత ఆలోచనల్లోంచి పుట్టిన ఓ చిన్న పాయింట్ ను రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను సీట్స్ లో కూర్చోబెట్టి చెప్పే సత్తా ఉన్నవాడే దర్శకుడిగా విజయాలను సంపాధిచగలుగుతాడు. సినిమా తీయాలనే కోరిక ఎంతమందికున్నా సినిమాతో తమ ప్రతిభను బలంగా చూపించగలిగుతున్న వారు చాలా తక్కువ. అంటే తాము ఊహించి రాసిన కథకు కథనం సరైనదా లేదా అన్న ఆలోచన చేసి సినిమాను ఓ అద్భుతమైన కావ్యంగాగా తీర్చిదిద్దే దర్శకులు మన దగ్గర ఎంతమంది ఉన్నారు. సినిమా అంటే కేవలం ఓ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఓ ఆలోచన.. ఓ సందేషం.. ఓ విమర్శనాస్త్రం.. అనే భావన ఎంతమంది దర్శకులు తమ సినిమాలతో ప్రేక్షకుల్లో ఆలోచన కలిగిస్తున్నారు అన్నది కూడా పరిగణలోకి తీసుకోవాలి.
అలా ఆలోచించే దర్శకులు తీసే ప్రతి సినిమా అవార్డులు రివార్డులు సంపాధించకపోవచ్చు కాని ప్రేక్షకుల చేత వారెవా అని చప్పట్లు కొట్టేలా చేయడం మాత్రం ఖాయం. ఇది.. తెలుగు సినిమా స్థాయి అని సగర్వంగా చెప్పుకునేలా చేసే ఎంతో మంది గొప్ప దర్శకులు ఉన్న తెలుగు సిని పరిశ్రమలో ప్రతి దర్శకుడు తమ సృజనను పెంచుకుని రోత కామెడీతో సినిమాలు తీయడం మానేసి ప్రేక్షకులను మార్చే సినిమాలను తీయాలని కోరుకుంటున్నారు. అలా తీసే ప్రతి దర్శకుడి సినిమా ఓ దృశ్యకావ్యంలానే ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.