కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా 17 బ్యాంకులకి రూ.9,000 కోట్లు ఎగనామం పెట్టి లండన్ పారిపోవడం, మన దేశంలోని చట్టాల బలహీనతకి, వాటిని అమలు చేయాల్సిన పాలకుల అసమర్ధతకి అద్దం పడుతోంది. దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లు, ఆయన దేశం విడిచి పారిపోతుంటే చూస్తూ ఊరుకొని, ఆయన లండన్ పారిపోయిన ఎవరు రమ్మన్నా నేను వచ్చేది లేదని తెగేసి చెపుతుంటే, ఇప్పుడు తాపీగా అందరూ రంకెలు వేయడం మొదలుపెట్టారు.
గత రెండేళ్లుగా ఈ అప్పుల వ్యవహారాలు సాగుతున్నప్పటికీ ఏనాడూ వాటి గురించి మాట్లాడని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న డిల్లీలో విజయ్ మాల్యా గురించి కొంచెం కటినంగా మాట్లాడటం విశేషం. “ఆయన తన గౌరవాన్ని నిలుపుకొంటూ మర్యాదగా బ్యాంకులకు చెల్లించాల్సిన బాకీలన్నీ చెల్లించాలి లేకుంటే తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవలసి వస్తుంది. వ్యక్తిగత హోదాలో రుణాలు తీసుకొన్నవారి గురించి నేనేమీ మాట్లాడదలచుకోలేదు కానీ, ఆయన గ్రూప్ సంస్థలు ఈ విధంగా బ్యాంకులకు అప్పులు చెల్లించకుండా తప్పించుకొందామంటే కుదరదు. కనుక ఆయన తన గౌరవాన్ని కాపాడుకొంటూ అప్పులన్నీ తీర్చివేయాలి. అది ఆయన బాధ్యతే. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుంది,” అని అరుణ్ జైట్లీ హెచ్చరించారు.
అయితే విజయ్ మాల్యాని భారత్ గడప దాటించింది మోడీ ప్రభుత్వమేనని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న నేపధ్యంలో, అరుణ్ జైట్లీ చేసిన ఈ హెచ్చరికలను కూడా అనుమానించవలసి వస్తోంది. నిజంగా విజయ్ మాల్య నుండి ముక్కు పిండి ఆ డబ్బు కక్కించాలనుకొంటె మోడీ ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఆ పని చేయకుండా చేతులు ముడుచుకొని ఆయన దేశం విడిచి పారిపోయయే వరకు చూస్తూకూర్చొన్నారు.
ఒకవేళ అతను దేశం విడిచి పారిపోతున్నప్పుడు అడ్డుకో(లే)కపోయినా, ఇప్పుడు కోర్టులు, బ్యాంకులు నోటీసులు పంపుతున్నా భారత్ రానని మొరాయిస్తున్న ఒక ఆర్ధిక నేరస్థుడి పట్ల చాలా కటినంగా వ్యవహరించాల్సిన అరుణ్ జైట్లీ, అంత సున్నితంగా ఎందుకు హెచ్చరిస్తున్నారు? అని ఆలోచిస్తే బహుశః ప్రజలను, ప్రతిపక్షాలను మభ్యపెట్టడానికేనేమోనని అనుమానించవలసి వస్తోంది.