అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ తన మనసులో ఆలోచనలను ఒకటొకటిగా బయటపెడుతుంటే అవి విని అందరూ ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యంగా ఆయన అనుసరించబోయే విదేశీవిధానాల గురించి చెపుతుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా కలవరపడుతున్నాయి. ఒక అమెరికన్ పత్రికకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో “సౌదీ అరేబియాకి అమెరికా రక్షణ కల్పించకపోయుంటే అదిప్పుడు కనబడేదే కాదు. ఇరాక్, సిరియా ఉగ్రవాదులపై పోరాటంలో అది కూడా మాతో కలిసి రావాలి లేకుంటే ఇకపై ఆ దేశం నుంచి చమురు కొనడం నిలిపివేస్తాము. ఒక్క సౌదీ అరేబియా మాత్రమే కాదు మా రక్షణ పొందుతున్న గల్ఫ్ దేశాలన్నీ అందుకు తగిన మూల్యం మాకు చెల్లించవలసి ఉంటుంది. లేకుంటే వాటి కోసం పోరాడవలసిన అవసరం మాకు లేదు,” అని అన్నారు.
యూరప్ దేశాల గురించి మాట్లాడుతూ, “ఈ ప్రపంచంలో ఇప్పుడు అమెరికాతో సహా ఏ దేశమూ కూడా పూర్తి భద్రమయినదని చెప్పలేము. పారిస్, బ్రసెల్స్ పై ఇటీవల జరిగిన దాడులు వాటిని అడ్డుకోవడంలో స్థానిక యంత్రాంగాల వైఫల్యాలు చూస్తే స్వేచ్చా ప్రపంచం పరిధి నానాటికీ కుచించుకు పోతోందని అర్ధమవుతోంది. యావత్ యూరప్ లో ఏ ఒక్క దేశమూ కూడా సురక్షితమయినది కాదని ఈ దాడులు స్పష్టం చేస్తున్నాయి,” అని అన్నారు.
‘నాటో’ మిత్ర రాజ్యాల గురించి కూడా ట్రంప్ తన అభిప్రాయాలను చాలా నిష్కర్షగా చెప్పేశారు. వాటి విషయంలో ఆయన ఒక పక్కా వ్యాపారస్తుడిలాగ మాట్లాడారు. నాటో దేశాలు తమ భద్రత, రక్షణ కోసం ఖర్చు చేస్తున్నదాని కంటే వాటి కోసం మేము ఖర్చు చేస్తున్నదే చాలా ఎక్కువ. ఒక విధంగా చెప్పాలంటే ‘నాటో కూటమి’ ఒక నిరుపేద దేశం వంటిది. దాని కోసం మిగిలిన అన్ని దేశాల కంటే అమెరికాయే ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తోంది. అది మాకు అంగీకారం కాదు. నాటోలో అన్ని దేశాలు కూడా అమెరికా మీద చాలా ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇది ఎవరికీ మంచిది కాదు. అమెరికా ఇంకా ప్రపంచ పోలీస్ పాత్ర పోషించే పరిస్థితిలో లేదు. ప్రపంచ దేశాల రక్షణ కోసం అది చాలా భారీ మూల్యం చెల్లిస్తోంది. దాని వలన అమెరికాకి పదేపదే ఎదురుదెబ్బలు తినవలసి వస్తోంది. అంతే కాదు దాని వలన అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుదేలయిపోతోంది. కనుక నేను అధికారంలోకి వస్తే మా రక్షణ పరిధిని అమెరికాకే పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తాను లేకుంటే అందుకు అన్ని దేశాలను తగిన మూల్యం చెల్లించమని కోరుతాను,” అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఉత్తర, దక్షిణ కొరియా, చైనా, జపాన్ ల గురించి కూడా డోనాల్డ్ ట్రంప్ కుండ బ్రద్దలు కొట్టినట్లు మనసులో మాట చెప్పారు. “ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకి, అలాగే చైనా నుంచి జపాన్ కి ప్రమాదం పొంచి ఉంటే, అందుకోసం అవి స్వీయ రక్షణ ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది. వాటిని ఎల్లకాలం అమెరికా కాపాడలేదు. కనుక నేను అధికారంలోకి వస్తే దక్షిణ కొరియా, జపాన్ దేశాల మీద అణు ఆంక్షలు సడలించి అవి కూడా అణ్వాయుధాలు తయారు చేసుకొనేందుకు అనుమతిస్తాను,” అని అణుబాంబు లాంటి మాట పేల్చారు ట్రంప్. ఉత్తర కొరియా ఇప్పటికే అమెరికాతో సహా అన్ని దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతోంది. దక్షిణ కొరియాకి అమెరికా రక్షణ తొలగించిన మరు క్షణం దానిపై దాడి చేయవచ్చును. ఒకవేళ దక్షిణకొరియా స్వీయ రక్షణ కోసం అణుబాంబులు తయారుచేసుకొంటే, దాని వలన ఆ రెండు దేశాల మధ్య అణ్వస్త్ర యుద్ధం జరిగే ప్రమాదం పొంచి ఉంటుంది.
“ముస్లింలందరూ అనుమానితులుగా చూడవలసిన వారే” అనే తన అభిప్రాయాన్ని ట్రంప్ ఈ సందర్భంగా మరోసారి నిర్భయంగా బయటపెట్టారు. “దేశంలోకి కొత్తగా ముస్లింలు ఎవరినీ అనుమతించకూడదు. నిత్యం వేలాది మంది దేశంలోకి వచ్చేస్తున్నారు. వారందరూ ఎవరో..ఎక్కడి నుంచి వస్తున్నారో..మన దేశానికే ఎందుకు వస్తున్నారో…అనే విషయాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు అందరినీ లోపలకి అనుమతిస్తున్నారు. దాని వలన వారికంటే మనకే చాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. కనుక నేను అధికారంలోకి వస్తే ముస్లింలు దేశంలో ప్రవేశించకుండ తాత్కాలికంగా నిషేధం విదిస్తాను,” అని స్పష్టం చేసారు ట్రంప్.