గత ‘మా’ ఎన్నికలు నువ్వా, నేనా అన్నట్టుగా సాగాయి. రాజేంద్ర ప్రసాద్, జయసుధ ఇద్దరూ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడ్డారు. సినిమా రంగం.. రాజకీయ రణరంగాన్ని తలపించింది. ఎత్తుకు పై ఎత్తులు వేశారు. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో వాగ్దానాలు కురిపించారు. తెర వెనుక కుట్రలూ సాగాయి. అయితే వాటన్నింటి మధ్య అనూహ్యంగా రాజేంద్రప్రసాద్ పోటీలో నిలిచాడు.. గెలిచాడు. ‘మా’ పీఠం ఎక్కాడు.
రాజేంద్రప్రసాద్ ‘మా’ అధ్యక్షుడయ్యాక.. అక్కడి వాతావరణం పూర్తిగా మారింది. తనకున్న స్నేహబలంతో అందరినీ కలుపుకొంటూ ‘మా’ కమిటీని ఏర్పాటు చేయగలిగాడు నట కిరిటీ. వచ్చిన కొత్తలో పబ్లిసిటీ స్టంట్ కి ఎక్కవ ప్రాధాన్యం ఇచ్చినా, ఆ తరవాత.. మాత్రం పనిపైనే దృష్టి నిలిపాడు. శివాజీరాజా, నరేష్, మంచు లక్ష్మిల సహకారంతో ‘మా’ని ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పుడు వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో.. ఓ కమిటీ స్థాపించి ‘మా’లోని పేద కళాకారులకు చేతనైనంత చేయూత అందిస్తున్నారు. మా సభ్యులకు గుర్తింపు కార్డులు, లైఫ్ ఇన్సురెన్సు పాలసీలు, హెల్త్ కార్డులూ అందించాడు. ఫించన్ మొత్తాన్ని రెట్టింపు చేశాడు. ఇదంతా ఏడాది కాలంలో జరిగిన అభివృద్ది. ఇది వరకు ఏళ్లకు ఏళ్లుగా మా అధ్యక్ష స్థానంలో కూర్చుని ఎవ్వరూ చేయలేని పనిని రాజేంద్ర ప్రసాద్ ఒక్క యేడాదిలోనే చేసి చూపించాడు. వనరులు తక్కువే అయినా… ఉన్నదాంట్లో ఏదో చేద్దామన్న ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తున్నాడు. అలా.. నటకిరిటీ `మా` మనసుల్ని గెలుచుకొన్నాడు. కిప్ ఇట్ అప్.. రాజేంద్రప్రసాద్!!