పఠాన్ కోట్ దాడులపై దర్యాప్తు కోసం పాక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యులతో కూడిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జిట్) ఆదివారం సాయంత్రం న్యూ డిల్లీకి చేరుకొని ఈరోజు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ.) సభ్యులతో సమావేశమయ్యింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న జిట్ మరియు ఎన్.ఐ.ఏ. సభ్యులు పరస్పరం తాము సేకరించిన సమాచారం మార్పిడి చేసుకొన్నట్లు తెలుస్తోంది.
రేపు (మంగళవారం) జిట్ సభ్యులను ప్రత్యేక విమానంలో పఠాన్ కోట్ తీసుకువెళ్లి అక్కడ ఉగ్రవాదులతో భారత జవాన్లు పోరాడిన ప్రదేశాన్ని చూపిస్తారు. ఆ తరువాత ఆ దాడికి ప్రత్యక్ష సాక్షులతో జిట్ బృందాన్ని మాట్లాడిస్తారు. కానీ పఠాన్ కోట్ లో భద్రతా సిబ్బందితో జిట్ బృందాన్ని మాట్లాడేందుకు అనుమతించమని తెలిపారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోపలకి జిట్ బృందాన్ని అనుమతించేది లేదని రక్షణ మంత్రి మనోహర్ పార్రికర్ స్పష్టం చేసారు.
జిట్ సభ్యులకు ఎయిర్ బేస్ కనబడకుండా చుట్టూ భారీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే పంజాబ్ కౌంటర్ టెర్రరిజం శాఖ అధిపతి మొహమ్మద్ తహీర్ రాయ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జిట్ బృందంలో అదే శాఖకు చెందిన గుజరన్ వాలా, పాక్ గూడచారి సంస్థ ఐ.ఎస్.ఐ.కి చెందిన లెఫ్టినెంట్ కర్నల్ తన్వీర్ అహ్మద్, మిలటరీ ఇంటలిజన్స్ కి చెందిన లెఫ్టినెంట్ కర్నల్ ఇర్ఫాన్ మిర్జా మరియు లాహోర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఇంటలిజన్స్ బ్యూరో) విభాగానికి చెందిన మొహమ్మద్ అజీం అర్షద్ సభ్యులుగా ఉన్నారు.
పఠాన్ కోట్ దాడులు జరిగి మూడు నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా, దర్యాప్తు పేరిట జిట్ బృందం భారత్ రావడానికి, పఠాన్ కోట్ సందర్శనకి మోడీ ప్రభుత్వం అనుమతించడాన్ని తప్పు పడుతూ డిల్లీలో ఆమాద్మీ పార్టీ కార్యకర్తలు నిరసనలు తెలియజేసారు. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
జిట్ బృందాన్ని దేశ రాజధాని డిల్లీలోకి, భారత్ కి అత్యంత కీలకమయిన వైమానిక స్థావరమయిన పఠాన్ కోట్ వద్దకి అనుమతించడం ద్వారా మోడీ ప్రభుత్వం పాక్ ముందు సాగిలపడిందని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఐ.ఎస్.ఐ. సంస్థే ఉగ్రవాదులకు అవసరమయిన సహాయసహకారాలు అందించి పఠాన్ కోట్ పై దాడికి కుట్ర పన్నినట్లు తేలిన తరువాత మళ్ళీ అదే ఐ.ఎస్.ఐ.కి చెందిన వ్యక్తులను పఠాన్ కోట్ తీసుకువెళ్ళాలనుకోవడం చాలా పొరపాటని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.