దేశంలో యువత అందరూ ‘భారత్ మాతాకి జై’ అనే నినదించడం అలవరుచుకోవాలని ఆర్.ఎస్.ఎస్.అధినేత మోహన్ భగవత్ కొన్ని రోజుల క్రితం చేసిన సూచనపై దేశంలో చాలా పెద్ద చర్చ, చాలా రాద్దాంతం జరగడం అందరూ చూసారు. కానీ మోహన్ భగవత్ వెనకడుగు వేయలేదు. దానిపై జరుగుతున్న రాద్దాంతాన్ని చూసి భాజపా సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ స్పందిస్తూ ‘అదొక అర్ధరహితమయిన వివాదం’ అని అన్నారు. బహుశః ఆ కారణంగానేనేమో, మోహన్ భగవత్ తన సూచనకు ఈరోజు ఒక సవరణ చేసారు.
లక్నోలో నిర్మించిన భారతీయ కిషాన్ సంఘ్ భవన ఉద్ఘాటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ “భారత్ మాతాకి జై! అని తప్పనిసరిగా నినాదం చేయాలని మేము ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు. మేము నమ్మిన సిద్దాంతాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాము తప్ప దానిని ఎవరిపై బలవంతంగా రుద్దబోము. ‘సర్వే జనో సుఖినో భవంతు’ అంటే యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలని కోరుకొనే దేశమే మనది తప్ప ఇతరులను బలవంతంగా లొంగదీసుకొని వారిపై పెత్తనం చేలాయించాలనుకొనే దేశం కాదు. తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు సంపాదించడం గొప్ప విషయమే కానీ కేవలం డబ్బు సంపాదించడమే మన గమ్యం కారాదు. భారతీయులు అందరూ కలిసి తమ సమిష్టి కృషితో దేశాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి, యావత్ ప్రపంచ దేశాలు ‘భారత్ మాతాకి జై’ అనే విధంగా చేయాలి.”
“వివిధ జాతులు, మతాలు,కులాలు, బాషలు, సంస్కృతుల అపూర్వ సమ్మేళనం మన దేశం. ఆ కారణంగా యావత్ ప్రపంచానికి ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తూనే ఉంది. భిన్నత్వంలోని ఏకత్వమే మన దేశం యొక్క ప్రత్యేకత. దానిని సదా నిలుపుకొంటూనే, అందరూ కలిసి దేశాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. మనం సమాజం నుండి తీసుకొనే దానికంటే తిరిగి ఎక్కువ ఇవ్వడం నేర్చుకోవాలి. అదే మా ఆర్.ఎస్.ఎస్. సిద్దాంతం,” అని మోహన్ భవత్ అన్నారు.
బహుశః ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశ్యంతోనే మోహన్ భగవత్ ఆ విధంగా అని ఉండవచ్చును. కానీ ‘యావత్ ప్రపంచం ‘భారత్ మాతాకి జై’ అనేంతగా దేశాన్ని అభివృద్ధి చేయాలి’ అని ఆయన చేసిన తాజా సూచనపై కూడా మళ్ళీ మరో వివాదం చెలరేగే అవకాశం ఉంది. ముస్లిం, క్రీస్టియన్ మత చాందసవాద సంస్థలు యావత్ ప్రపంచంలో కేవలం తమ మతాలు మాత్రమే వ్యాప్తి చెంది అందరూ వాటినే అనుసరించాలని ఏవిధంగా కోరుకొంతున్నాయో, మోహన్ భగవత్ కూడా యావత్ ప్రపంచమంతా హిందూమతమే ఉండాలని కోరుకొంటున్నారనే వాదనలు, ప్రతివాదనలు, విమర్శలు ప్రతివిమర్శలు మళ్ళీ మొదలయితే ఆశ్చర్యమేమీ లేదు.