తెదేపా మళ్ళీ పదేళ్ళ విరామం తరువాత అధికారంలోకి రాగలిగింది కానీ ఈసారి మొదటి రోజు నుంచే అనేక సవాళ్ళను, సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు సాగవలసి వస్తోంది. విభజన కారణంగా ఒకపక్క తెలంగాణా ప్రభుత్వం నుండి సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొంటూనే మరో పక్క ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటోంది. అదేవిధంగా తెలంగాణాలో తెరాస నుంచి, ఆంధ్రాలో వైకాపా నుంచి నిత్యం అనేక సవాళ్ళను ఎదుర్కోక తప్పడం లేదు. ఈ 22 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు కొంచెం చక్కబడినట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ, ఆర్ధిక సమస్యలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ 22 నెలల్లో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి సుమారు రూ. 1.40 లక్షల కోట్లు విలువ చేసే అభివృద్ధి, సంక్షేమ పధకాలు, ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేసినట్లు భాజపా అధినేత అమిత్ షా స్వయంగా ప్రకటించారు. కనుక కేంద్రాన్ని కూడా పూర్తిగా తప్పు పట్టలేము.
ఇప్పుడు ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యంగా ఉన్నారు. కనుక ఇదివరకులాగ ఎన్నికల సమయంలో నోటికి వచ్చిన హామీలు ఇచ్చేసి వాటిని నెరవేర్చకుండా తప్పించుకోవాలనుకొంటే ప్రజలు ఊరుకోవడం లేదు. ప్రజలే కాదు ప్రతిపక్షాలు కూడా వదిలిపెట్టవు. కనుక 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు స్వయంగా ఇచ్చిన హామీలలో సింగపూర్ వంటి అద్భుతమయిన రాజధాని, పోలవరం ప్రాజెక్టు, వైజాగ్, విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం వంటివాటిని వచ్చే ఎన్నికలలోగా పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే పంట రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, పేదలకు ఇళ్ళు వంటి అనేక ఇతర హామీలు ఉండనే ఉన్నాయి. ఆ హామీలను కూడా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవలసి ఉంది. ప్రధానంగా రాజధాని, పోలవరం నిర్మాణం హామీలను నిలబెట్టుకోలేకపోతే వచ్చే ఎన్నికలలో అందుకు మూల్యం చెల్లించక తప్పదు.
అదీగాక తెదేపాకి మిత్రపక్షమయిన భాజపా, శత్రుపక్షమయిన వైకాపాల నుంచి కూడా వచ్చే ఎన్నికలలో సవాళ్ళు ఎదురయ్యే అవకాశాలున్నాయి. కనుక మిగిలిన ఈ మూడేళ్ళలో ఆ హామీలను అమలు చేయడమే కాకుండా పార్టీని మరింత బలోపేతం చేసుకోవలసి ఉంటుంది. హామీల అమలుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు ఆర్ధిక ఇబందుకు పెద్ద అవరోధంగా ఉన్నాయి. వాటిని ఆయన అధిగమించగలరా లేదో వేచి చూడాలి. కానీ ఈలోగా పార్టీని బలోపేతం చేసుకొనేందుకు వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలోకి రప్పించేందుకు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ హామీలను నిలబెట్టుకోలేకపోయినా రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసి, తెదేపాకు పోటీ లేకుండా చూసుకొని, ఆవిధంగా రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లున్నారు. అయితే అది అసాధ్యమని బహుశః ఆయనకీ తెలిసే ఉంటుంది. కానీ తన ముందున్న అన్ని అవకాశాలను ఆయన వినియోగించాలనుకొంటున్నారని భావించవలసి ఉంటుంది.
ఇంక తెలంగాణాలో ఓటుకి నోటు కేసుతో తెదేపా ప్రతిష్ట బాగా దెబ్బతింది. ఆ కారణంగానే తెలంగాణాలో తెదేపా కూడా తుడిచిపెట్టుకుపోతోందని చెప్పవచ్చును. తెదేపాని జాతీయపార్టీగా మలచాలనుకొంటున్న తరుణంలో తెలంగాణా రాష్ట్రం నుండి కూడా తుడిచిపెట్టుకు పోవడం చాలా విచారకరం. అటువంటప్పుడు జాతీయ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి అని పదేపదే చెప్పుకోవడం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏదో విధంగా చంద్రబాబు నాయుడు సయోధ్య కుదుర్చుకోగలిగారు కానీ అందుకు తెలంగాణాలో తెదేపాను పణంగా పెట్టవలసి రావడం దురదృష్టకరమే. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణాలో పార్టీ పరిస్థితి గురించి నిజాయితీగా సమీక్షించుకొని తగిన నిర్ణయం తీసుకొంటే మంచిది. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్నట్లు ఇప్పుడే తగిన నిర్ణయం తీసుకోకపోతే చాలా అవమానకర పరిస్థితులలో తెలంగాణాలో పార్టీని మూసుకోవలసి వస్తుంది.
ఈవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తెలుగు దేశం పార్టీ అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు సాగవలసి వస్తోంది. సమస్యలను, సవాళ్ళను అవకాశాలుగా భావిస్తానని చంద్రబాబు నాయుడు చెపుతుంటారు. కనుక ఆయన ముందు ఇప్పుడు అవసరమయిన దాని కంటే చాలా ఎక్కువ ‘అవకాశాలే’ ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. మరి ఇన్ని ‘అవకాశాలను’ ఆయన ఉపయోగించుకొని వచ్చే ఎన్నికలలో తెదేపాను ఒడ్డున పడేస్తారో లేదో తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.