ఏప్రిల్ 8న ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చేస్తాం… అంటోంది సర్దార్ టీమ్. వస్తే మంచిదే. కానీ.. ఆ టైమ్‌కి రావాలంటే మాత్రం సర్దార్ టీమ్ మొత్తం కంటి మీద కునుకు లేకుండా రాత్రీ పగలూ కష్టపడాల్సిందే. ప్రస్తుతం స్విర్జర్లాండ్‌లో సర్దార్ పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఏప్రిల్ 1న గానీ టీమ్ తిరిగి రాదు. అయితే మార్చి 31న సర్దార్ సెన్సార్ కోసం అప్లయ్ చేశారు. అయితే అప్పటికి మూడు పాటలు ఇంకా ఎడిట్ చేయాల్సి వుంటుంది. పాటల్లేకుండా సినిమాని సెన్సార్ చేయడం కష్టం. సో… మార్చి 31నే పాటలు లేకుండా సినిమాని సెన్సార్ చేయించాలా, పాటలొచ్చాక అప్పుడు పాటల్ని విడిగా సెన్సార్ చేయించాలా. లేదంటే రెండు రోజులు ఆగి.. ఏప్రిల్ 2న సినిమా మొత్తాన్ని ఒకేసారి సెన్సార్ చేయించాలా? అనే విషయంలో టీమ్ మొత్తం మల్లగుల్లాలు పడుతోంది.
ఏప్రిల్ 2న సెన్సార్ జరక్కపోతే ఏప్రిల్ 4 వరకూ ఆగాల్సిందే. అలా ఆగితే.. ఓవర్సీస్‌లో ఏప్రిల్ 7న ప్రీమియర్ షోలు వేయడానికి వీలు పడదు. అందుకే ఏం చేయాలో సర్దార్ బృందానికి పాలుపోవడం లేదట. మార్చి 31న పాటలు లేకుండా సినిమాని సెన్సార్ చేయించాలని, మిగిలిన సంగతి తరవాత చూసుకొందామని పవన్ చెబుతున్నాడట. పవన్ మాటంటే శాసనమే. అందుకే.. చిత్రబృందం పాటలు లేకుండా సెన్సార్‌కి వెళ్లిపోవాలని నిర్ణయించుకొందని టాక్.