గోదావరికి నిత్య హారతి పుష్కరాల తరువాత కూడా కొనసాగుతుందా ? అని అడిగినపుడు “నిత్య”హారతి అన్న పేరే చెబుతుంది కదా అన్నారు రాష్ట్రదేవాదాయ శాఖ కమీషనర్ అనూరాధ. నిత్యహారతి ఎక్కడ ఎవరు ని్వహిస్తారు? అన్న ప్రశ్నకు”దేవాదాయ శాఖతో మాట్లాడి చెబుతాను” అన్నారు సమాచారశాఖ మంత్రి రఘునాధరెడ్డి. హారతి విషయమై శాస్త్ర సాంప్రదాయాలకు, భౌతిక ప్రయోజనాలకూ మధ్య సమన్వయం తీసుకురావడమెలాగో ముఖ్యమంత్రే స్పష్టతకు రాకపోవడమే ఇక్కడ అసలు విషయం.
కాశీలో గంగానదికి ఇచ్చేవిధంగానే రాజమండ్రిలో గోదావరికి హారతి ఇచ్చే ఈవెంటుని ప్రవేశపెడితే టూరిస్టులకు పెద్ద ఆకర్షణ అవుతుందన్న ఆలోచనతో పోలవరంలో పుట్టి, న్యూఢిల్లీలో ఉంటున్నసామాజిక అర్ధిక వేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు ఎనిమిది సంవత్సరాల క్రితమే మొత్తం ఐదుసార్లు పుష్కరఘాట్ వద్ద గోదావరికి హారతి స్ధానికులతో హారతి ఇప్పించారు. అయితే గంగకే తప్ప గోదావరికి హారతి అవసరంలేదని పూజారులు స్పష్టం చేశారు. భారీ ప్రచారం, ఈవెంటు నిర్వహణకు నిధులు లేకపోవడం వల్ల హారతి కొనసాగలేదు.
నాలుగేళ్ళ క్రితం బుద్ధవరపు ట్రస్ట్ గోదావరి కి హారతి కార్యక్రమాన్ని పటాటోపంగా ప్రారంభించింది. ప్రతీ పౌర్ణమిరోజూ హారతి ఇస్తున్నారు. భారీ అడ్వర్టయిమెంట్లు ఇచ్చి, పెద్దస్ధాయి వ్యక్తులు పాల్లొనేలా చూడటం ద్వారా బుద్ధవరపు ట్రస్ట్ ఈవెంటుని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చింది. చివరికి ప్రభుత్వ సహకారంతో పబ్లిక్ ప్రయివేట్ పార్టిసి పేషన్ విధానంలో ట్రస్టే నిత్యహారతి ఇచ్చే కార్యక్రమం ఈమధ్యే మొదలైంది.
పుష్కరాల ప్రారంభానికి ఒక రోజుముందు ముఖ్యమంత్రే హారతి ఇచ్చారు. ఆవేదిక మీద ట్రస్ట్ ముఖ్యులు వుండటం తెలుగుదేశం పార్టీలో వివాదమైంది. ట్రస్ట్ ముఖ్యులకు, సమాజంలో గౌరవ ప్రదమైన స్ధానంలేదు. ఒకాయన ఆర్ధిక నేరంగా చీటింగ్ కేసులో జైలు రిమాండులో వుండి బయటపడ్డారు. వేరోకరు పనులు చేయించే రాజకీయబ్రోకర్ అనే సుపరిచితుడు. వారు కాంగ్రెస్ పార్టీకి సన్నిహితులు. అప్పటికి వారం క్రితం కూడా వారు చంద్రబాబు ని వ్యక్తిగతంగా నిందించిన పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో పాటు విలేకరుల సమావేశంలో వున్నారు. ఈవివరాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళాయి. ఫలితంగా పుష్కరాల రోజునుంచీ నిత్యం జరుగుతున్న హారతిలో బుద్దవరపు ట్రస్ట్ ముఖ్యులు కనబడటం లేదు.
ఈ వివాదం ఎలావున్నా గోదావరి కాన్సెప్ట్ ముఖ్యమంత్రికి బాగా నచ్చింది. పట్టిసీమనుంచి, ఏడుగోదావరులూ సముద్రతీరంతో కలిసే ముఖద్వారాల వరకూ వున్న అద్భుత దృశ్యాలన్నిటికీ అప్రోచ్ లను అభివృద్ధి చేసి రాజమండ్రిని ఆంధ్రప్రదేశ్ కే టూరిస్ట్ హబ్ గా , వాటర్ వేస్ క్లస్టర్ గా మారుస్ధామని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. కోల్ కత్తా నుంచి చెన్నై వరకు ఎవరైనా సాయంకాలం రాజమండ్రిలో వుండటం జరిగితే గోదావరి హారతిని చూసి వెళ్ళాలనేటంత ఘనంగా ఈవెంటు వుండాలని ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారు. రెండు వంతెనల మధ్య నదిలో హారతి ఇస్తూంటే ప్రజలు మెట్లమీద కూర్చుని చూడటం గొప్ప దృశ్యమౌతుందని అన్నారు. ” నది ఒడ్డున వుండి నదికి ఇవ్వడం సాంప్రదాయం నదిలో వుండి కాదు” అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అదేసమావేశంలో ముఖ్యమంత్రికి చెప్పినపుడు ” ”సాంప్రదాయాన్ని మారుద్దాం” అని వ్యాఖ్యానించారు.
కాశీలో పురోహితులు మెట్లమీద నిలబడి గంగానదికి నిత్యహారతి ఇస్తారు. మెట్ల వెనుక కనిపించే ఎత్తయిన ఆలయాలు మెజెస్టిక్ గా వుంటాయి. యాత్రీకులు నదిమీద పడవల్లో వుండి హారతిని చూస్తారు.రాజమండ్రిలో మెట్ల వెనుక ఆలయాలు లేదా ఉన్నతంగా కనిపించే దృశ్యమో, వాతావరణమో లేదు. అందుకే ఎంతసేపు చూసినా విసుగురాని నీటినే హారతి బ్యాక్ గ్రౌండ్ చా చూపించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన
సాంప్రదాయానికి వ్యతిరేకమే అయినా కనువిందైన దృశ్యంగానే ప్రస్తుతానికి గోదావరి నిత్యహారతి కొనసాగుతోంది.” ఇది గోదావరికి కాక ప్రజలకు హారతి ఇస్తున్నట్టు వుంది” అని విలేకరులు అన్పపుడు ”నిజమే, అయితే రాజమండ్రిని ఈజీగా ప్రపంచం ముందుంచడానికి ఇలాంటి విజువల్స్ ని వొదులుకోలేము..నదికే హారతి ఇస్తున్న విధంగా ఏంగిల్ మారిస్తే ఈ బ్యూటీ వుండదు. సాంప్రదాయం చెప్పే పెద్దలను సంప్రదించి సొల్యూషన్ వెతుకుదాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.