వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి ఉపయోగిస్తున్నట్లుగా తయారయింది. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావుకి క్షమాపణ చెప్పి తన విధించిన ఏడాది సస్పెన్షన్ రద్దు చేయించుకొనే అవకాశం ఉన్నప్పటికీ, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాటను కాదనలేక న్యాయపోరాటం మొదలుపెట్టారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆమెకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును రోజా సుప్రీం కోర్టులో సవాలు చేసారు. ఆమె కేసును విచారణకు చేపట్టిన న్యాయస్థానం దానిని శుక్రవారానికి వాయిదా వేసింది.
ఈ పోరాటం వలన వ్యక్తిగతంగా ఆమెకి ఎటువంటి రాజకీయ లబ్ది కలగకపోగా, సుప్రీం కోర్టు కూడా తిరస్కరిస్తే మరింత అవమానకరంగా మారుతుంది. శాసనసభ, పార్లమెంటు వ్యవహారాలలో, వాటి పరిధిలో ఉన్న అంశాలపై సాధారణంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి ఇష్టపడవు. ఆ సంగతి ఆమెకు, జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసు.
సభా హక్కుల కమిటీ నాలుగు సార్లు నోటీసులు పంపినా దాని ముందు ఎందుకు హాజరు కాలేదని ఒకవేళ సుప్రీం కోర్టు కూడా ప్రశ్నిస్తే, మీడియాకి చెప్పిన జవాబే చెపితే, న్యాయస్థానం కూడా ఆమెనే తప్పు పట్టవచ్చును. ఏవిధంగా చూసినా సుప్రీం కోర్టులో కూడా ఆమెకు ఎదురుదెబ్బ తగిలే అవకాశమే కనిపిస్తోంది. అయినా ఈ వ్యవహారంలో తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లుగా జగన్ ఆదేశాలను పాటిస్తూ రోజా మొండిగా ముందుకే వెళుతున్నారు కనుక దాని దుష్ఫలితాలు కూడా అనుభవించక తప్పదు.