ప్రతీ రాజకీయ పార్టీలో నోటి దురద ఎక్కువ ఉన్నవాళ్ళు కొందరుంటారు. వారే తరచూ మీడియా ముందుకు వచ్చి ఇతర పార్టీలపై, వాటి నేతలపై నోటికి వచ్చినట్లు విమర్శలు గుప్పిస్తుంటారు. ఆవిధంగా వారు ప్రజల దృష్టిలో పడాలని, పనిలో పనిగా తమ అధిష్టానాన్ని కూడా ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అటువంటి వారిలో వైకాపా ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు. ఆమె నోరు విప్పి మాట్లాడేరంటే, అది ఖచ్చితంగా తెదేపాని, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని విమర్శించడానికే అయ్యుంటుంది. ఒకప్పుడు తెదేపాలో ఉన్న ఆమె ఇప్పుడు తెదేపాను బద్ధ శత్రువుగా భావిస్తున్నారు. ఇవ్వాళ్ళ తెదేపా 35వ ఆవిర్భావ దినోత్సవం. కనుక చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలు, కార్యకర్తలు అందరూ వేడుకలు జరుపుకొన్నారు.
ఈ సందర్భాన్ని ఆమె చంద్రబాబు నాయుడుని విమర్శించడానికి ఉపయోగించుకొన్నారు. చంద్రబాబు నాయుడు గురించి ఆమె చెప్తారో అందరికీ తెలుసు కనుక ఆ విమర్శల చిట్టాని పక్కనబెట్టి, నారా లోకేష్, జూ.ఎన్టీఆర్ గురించి ఆమె అన్నమాటలు చెప్పుకొందాము.
ఆమె మీడియాతో మాట్లాడుతూ, “జూ.ఎన్టీఆర్ పార్టీలో ఉంటే అతని ముందు తన పప్పు సుద్ద వంటి కొడుకు నారా లోకేష్ ప్రజల కంటికి ఆనడని చంద్రబాబు నాయుడు జూ.ఎన్టీఆర్ ని అణగ ద్రొక్కేసారు. ఇంకా అతనిని దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో తెదేపా శ్రేణులు అతని సినిమాలకు కూడా అడ్డుపడుతున్నాయి. అసలు సి జూ.ఎన్టీఆర్ అనే పేరు కూడా వినపడకూడదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వారసులని ప్రచారం కోసం వాడుకొంటారు. ఆ తరువాత వారిని పులిహోరలో కరివేపాకులాగ తీసి పక్కన పడేస్తుంటారు,” అని రోజా విమర్శించారు.
రోజా చెప్పిన మాటలు సహేతుకమయినవే కావచ్చును. ఆమెకు తెదేపా పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల కోపం, అసహ్యం, రాజకీయ వైరం ఉంటే అవి నేరుగా వారితోనే తేల్చుకొంటే బాగుంటుంది. కానీ మధ్యలో జూ.ఎన్టీఆర్ ప్రస్తావన చేయడం అనవసరం. ఒకవేళ తెదేపా శ్రేణులు అతని సినిమాలను అడ్డుకొంటున్నట్లయితే ఆ విషయం స్వయంగా తేల్చుకోగల శక్తి అతనికి ఉంది. జూ.ఎన్టీఆర్ ఏనాడూ మీడియా ముందుకు వచ్చి తెదేపా శ్రేణులు తన సినిమాలను అడ్డుకొంటున్నాయని పిర్యాదు చేయలేదు. ఒకవేళ అతను రోజా లేదా వైకాపాకు మొరపెట్టుకొని వారి సహాయం అర్ధించి ఉండి ఉంటే అప్పుడు తప్పకుండా అతనికి అండగా నిలబడి ఆమె తెదేపాతో యుద్ధం చేసినా అర్ధం ఉంటుంది. కానీ తెదేపా-వైకాపాల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరంలోకి, రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూ.ఎన్టీఆర్ పేరును లాగడం సరికాదు.