ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏదయినా ఒక అంశంపై జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించగానే, వెంటనే తెదేపా నేతలో లేక స్వయంగా ఆయనో లేచి నిలబడి జగన్మోహన్ రెడ్డి ప్రతీ శుక్రవారం కోర్టుకు పోతున్న సంగతిని గుర్తు చేసి, ‘అటువంటి నువ్వా మాకు నీతులు చెప్పేది?’ అని జగన్ వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టి ఆయన నోరు మూయించే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు జగన్ లేదా వైకాపా ఎమ్మెల్యేలలో ఎవరో ఒకరు లేచి నిలబడి ‘ఓటుకి నోటు కేసు’ గురించి తెదేపాకి గుర్తు చేసి వారి నోళ్ళు మూయించే ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఇద్దరు నేతలకి వీక్ పాయింట్లు ఆవిధంగా కూడా పనికి వస్తున్నాయన్న మాట.
పట్టిసీమ-పోలవరం ప్రాజెక్టుపై మంగళవారం శాసనసభలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మధ్య తీవ్ర వాదోపవాదాలయినప్పుడు కూడా ఇద్దరూ మళ్ళీ ఈ ప్రసక్తి చేసి ఒకరినొకరు దెప్పి పొడుచుకొన్నారు.
“తెలంగాణాలో గోదావరి నదిపై ప్రాజెక్టులు కట్టుకొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొంటుంటే, చంద్రబాబు నాయుడుని వాళ్ళు ఎందుకు పిలువలేదు? పిలువకపోతే ఆయన ఎందుకు నోరు మూసుకొని కూర్చొన్నారు? పాలమూరు ఎత్తిపోతల పధకం ద్వారా తెలంగాణా ప్రభుత్వం కృష్ణా నీటిని తరలించుకొని పోతుంటే ఎందుకు చూస్తూ కూర్చొన్నారు?” అని ప్రశ్నించిన జగన్ మళ్ళీ దానికి ఆయనే సమాధానం కూడా చెప్పారు. “తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటుకి నోటు కేసు ఎక్కడ బయటకి తీస్తారో అనే భయంతోనే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి నష్టం జరుగుతున్నా నోరు మూసుకొని చూస్తూ కూర్చోన్నారు,” అని జగన్ ఎద్దేవా చేసారు.
దానికి చంద్రబాబు బదులిస్తూ “కేసీఆర్ ని చూసి నేనెందుకు భయపడాలి? హైదరాబాద్ లో దొంగ ఆస్తులున్న నువ్వే కేసీఆర్ ని చూసి భయపడాలి. నేనొక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. వారంవారం కోర్టుకి వెళ్లి వచ్చే నువ్వా నన్ను విమర్శించేది. నేను రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాను. అందుకు ఎవరు అడ్డొచ్చినా నిలదీస్తాను. నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి నా మీద 20 కేసులు పెట్టారు కానీ ఏమీ చేయలేకపోయారు. ఇంకా నువ్వేమి చేయగలవు?” అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇద్దరూ ఒకరి వీక్ పాయింట్ మీద మరొకరు బాగానే దెబ్బ కొట్టుకొన్నారు. కానీ జగన్ లేవనెత్తి సమస్యకి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేదు. అలాగే చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకి జగన్ స్పందించలేదు. కృష్ణ, గోదావరి నీళ్ళ వాడకంపై వాదన మొదలు పెట్టి ఆ సమస్యకి పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించకుండా ఆ వంకతో ఒకరినొకరు కసి తీరా తిట్టుకొన్నారు అంతే.