తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఎమ్మెల్యే కావాలని కల గంటున్నారా? అయితే ఇక మీరు పూర్తిస్థాయి యాక్షన్‌లోకి దిగవలసిందే. ఇక డబ్బు సంచులు బయటకు తీయవలసిందే. తమ తమ నియోజకవర్గాల్లో జనాన్ని తమ వైపు ఆకట్టుకోవడానికి అంతో ఇంతో కసరత్తు ప్రారంభించవలసిందే. ఎందుకంటే.. 2019ఎన్నికలకు ముందుగానే.. కొత్త నియోజకవర్గాలు … అనగా నియోజకవర్గాల పునర్విభజన.. కార్యరూపంలోకి వచ్చేలా చేయడానికి కేంద్రప్రభుత్వం తరఫున వెంకయ్యనాయుడు గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తున్నది.
విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోను అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగవలసి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం ఎప్పటికి అమల్లోకి వస్తుందో మాత్రం ఎవ్వరికీ క్లారిటీ ఉండడం లేదు. ఇదే అంశం మీద వైసీపీ నాయకులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను ఢిల్లీలో కలిసిన సందర్భాల్లో 2019 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ సెగ్మెంట్ల విభజన పర్వం పూర్తికాదని ఆయన చెప్పిన సంగతి కూడా చాలా మందికి గుర్తుండవచ్చు. అయితే ఇటు ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, తెలుగు రాష్ట్రాల తరఫున కేందమంత్రి వెంకయ్యనాయుడు కూడా.. ఈ అంశం మీద బాగా దృష్టిపెడుతున్నారు. సెగ్మెంట్ల సంఖ్య పెరగడం అంటే.. కొత్త వారికి బోలెడంత మందికి అవకాశం కల్పించడం.. రాజకీయంగా ఆశలు పెంచుకుంటున్న వారికి అవకాశాలు దక్కడం గనుక… నాయకులంతా ఈ అంశం మీద మాత్రం చాలా పట్టుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
మొన్నమొన్నటి దాకా త్వరలోనే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి.. కానీ ఎప్పుడో చెప్పలేం అనే తరహాలో మాట్లాడుతూ వచ్చిన వెంకయ్యనాయుడు.. కేంద్రంలో తాజాగా క్రియాశీల కసరత్తును కూడా ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు చేయాల్సి ఉన్న హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌తో వెంకయ్య భేటీ అయి వ్యవహారాన్ని ముందుకు తీసుకువెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చేనెలలో సభ ముందుకు బిల్లు తేవాలని ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నది. ఇదే జరిగితే ఏపీలో ఉన్న 175 స్థానాలు 225 అవుతాయి. అలాగే తెలంగాణలోని 119 స్థానాలు 153 అవుతాయి.
కొత్త నియోజకవర్గాలు రాబోయే 2019 ఎన్నికలకే కార్యరూపంలోకి వచ్చేస్తాయని బాగా ప్రచారం ఊపందుకుంటూ ఉండడంతో.. ఆశావహులంతా ఉత్సాహపడుతున్నారు. సెగ్మెంట్ల పునర్విభజనను నమ్ముకుని.. ఇరు రాష్ట్రాల్లోనూ అనేక మంది యువనాయకులు రాజకీయంగా ఆశలు పెంచుకుంటున్నారు. వారందరికీ వెంకయ్యనాయుడు చేస్తున్న ప్రయత్నాలు ఆశలు పుట్టిస్తుంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.