తెలంగాణా రాష్ట్రంలో తెదేపా ప్రస్తుత పరిస్థితి, దాని భవిష్యత్ గురించి సామాన్య ప్రజలు సైతం మాట్లాడగలుగుతున్నారు. కానీ, ఆ పార్టీలో మిగిలి ఉన్న తెలంగాణా నేతలకి మాత్రం తమ పార్టీ మళ్ళీ ఏదో ఒకరోజు పూర్వ వైభవం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తుండటం మెచ్చుకోవలసిందే. రాజకీయ నేతలకు అటువంటి ఆశాకరమయిన దృక్పధం ఉండటం చాలా మంచిదే.
నిన్న తెదేపా పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు చేసిన వ్యాఖ్యలు పార్టీపై వారికున్న అభిమానాన్ని, నమ్మకానికి అద్దం పట్టేవిగా ఉన్నాయి. వారిలో రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ “గౌరవం, పరువు కోరుకొనేవారు పార్టీలో ఉంటారని, పదవులు, అధికారం కోరుకొనేవారు తెరాసలోకి వెళుతుంటారు,” అని అన్నారు.
ఆయన అన్నఆ చిన్నమాట నూటికి నూరు పాళ్ళు నిజమని చెప్పక తప్పదు. పదవులు, అధికారం కోసం ఆశపడి తెరాసలోకి వెళుతున్న తెదేపా, కాంగ్రెస్ నేతలలో అవి దక్కనివారు బాధపడటం సహజమే. అవి దక్కినవారు కూడా పార్టీలో తెరాస నేతల మధ్య ఇమడలేక ఇబ్బంది పడుతున్నారు. తెదేపా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో కూడా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారు సహజంగానే అందరి దృష్టిలో చాలా గౌరవం పొందుతున్నారు.
తెదేపా పట్ల ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి కనబరిచిన అభిమానం చాలా మెచ్చుకోదగ్గదే. తను చివరి శ్వాస వరకు పార్టీలోనే ఉంటానని, చనిపోయిన తరువాత తన శవంపై తెదేపా జెండా కప్పాలని ఆయన కోరారు. ఆయన నిజంగానే చివరి వరకు ఆ మాటకు కట్టుబడి తెదేపాలో కొనసాగినట్లయితే, ఆయనంత నమ్మకస్తుడయిన నేత మరొకరు ఉండరనే చెప్పవచ్చును.
తెలంగాణా రాష్ట్రంలో పార్టీని కాపాడటానికి చంద్రబాబు నాయుడు రావాలని కోరారు. అయితే సాధ్యం కాదని ఆయనకీ తెలుసు. అలాగే తెదేపా మహిళా నేత శోభారాణి మాట్లాడుతూ తెలంగాణాలో పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం సాధించవచ్చని కానీ అందుకు మంచి సమర్దుడయిన నేత కావాలని సూచించారు. ఆమె సూచన కూడా ఆలోచించదగ్గదే.
ప్రస్తుతం తెలంగాణాలో తెదేపా దశదిశ లేకుండా ముందుకు సాగుతోంది. పార్టీలో సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు అందరూ ఒకరొకరుగా తెరాసలో చేరిపోతుండటంతో కార్యకర్తలు కూడా మనో నిబ్బరం కోల్పోతున్నారు. అయినా పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. పార్టీ మనుగడపై అధిష్టానానికి నమ్మకం కోల్పోయినా, ఇంకా పార్టీలో మిగిలి ఉన్న నేతలు పార్టీ భవిష్యత్ పై నమ్మకం వ్యక్తం చేస్తుడటం విశేషం. కనీసం ఇప్పటికయినా పార్టీ అధిష్టానం మేల్కొంటుందో లేదో చూడాలి.