హైదరాబాద్: అనంతపురంజిల్లాలో రైతుభరోసా పాదయాత్ర నిర్వహించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి తన మధ్యాహ్న భోజనాన్ని కొండకమర్ల గ్రామంలోని ఒక దళితుడి ఇంట్లో చేశారు. ఉదయం ఓబుళదేవర చెరువునుంచి పాదయాత్ర చేపట్టిన రాహుల్ కొండకమర్లలో దానిని ముగించారు. అక్కడ బహిరంగసభలో ప్రసంగించినతర్వాత ఆ గ్రామంలోని దళితవాడకు వెళ్ళి రవి అనే దళితుడి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ ఇంట్లోని పిల్లలను పక్కన కూర్చోబెట్టుకుని వారితోబాటుగానే పళ్ళెంలో వడ్డించిన పదార్థాలను చక్కగా ఆరగించారు. భోజనంలో రాహుల్‌కు రాగి సంకటి, పప్పు, అన్నం, వడలు వడ్డించారు. ఎలాంటి భేషజాలూ లేకుండా రాహుల్ స్వూన్‌తో అన్ని పదార్థాలనూ తిన్నారు. తర్వాత ఆ ఇంటి గృహిణిని భోజనం బాగుందని మెచ్చుకున్నారు. పిల్లలను పలకరించి వారు ఏమి చదువుతున్నారో తెలుసుకున్నారు. చిరంజీవికూడా రాహుల్‌తోబాటే అక్కడ భోజనంచేశారు. రాహుల్, చిరంజీవి తమ ఇంట్లో భోజనం చేయటంతో ఆ ఇంటివారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు.