మహా అయితే ఆయన పరుగుల సునామీ క్రిస్ గేల్ చేతిలో ధన్యత పొందిన క్రికెట్ బ్యాట్‌ను తనకు పర్సనల్ కానుకగా స్వీకరించి ఉండవచ్చు గాక! అందుకు గాను.. క్రిస్‌గేల్‌ను తన స్వగృహానికి ఆహ్వానించి.. సత్కరించడమూ, ధన్యవాదాలు తెలియజేయడమూ, ఆతిథ్యం ఇవ్వడమూ తన బాధ్యతగా భావించి ఉండవచ్చు గాక..! అంత మాత్రాన భారత్‌కు చేటు చేసే కోరికలు కోరుకోవడం ఏం బాగుంటుంది? పైగా భారత్ గర్వించే సెలబ్రిటీగా, భారతమాత ముద్దుబిడ్డగా ఈ దేశ పౌరులు భావించే ఒక పెద్దమనిషి.. ఇలా భారత్‌ను టెన్షన్ పెట్టే ఆలోచనలు చేస్తే ఎలాగా? అందుకే… తాజాగా అమితాబ్ బచ్చన్ కోరికలు విన్నవారు ఆయనలో పైత్యం ఇలా ప్రకోపించింది ఏమిటా? అని విస్తుపోతున్నారు.
టీ20 మ్యాచుల్లో పరుగుల సునామీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వెస్టిండీస్ దిగ్గజం క్రిస్‌గేల్ అంటే.. చాలా మందికి లాగే అమితాబ్ బచ్చన్‌కు కూడా తెగ అభిమానం ఉన్నమాట నిజం. ఈ అభిమానాన్ని పురస్కరించుకుని గేల్ తన క్రికెట్బ్యాట్ను బిగ్‌బీకి గతంలో కానుకగా పంపారు కూడా. ఆ బ్యాటుతో కలిసి అమితాబ్ పోజిచ్చిన ఫోటోను గేల్ తన ట్విటర్ ఖాతాలోనూ షేర్ చేసుకున్నారు.
అయితే తాజా తగాదా ఏంటంటే.. క్రిస్ గేల్‌ను అమితాబ్ తన ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చాడు. క్రిస్‌గేల్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉండి టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఏ దేశపు ఆటగాడికైనా అమితాబ్ ఇంటికి వెళ్లి విందుస్వీకరించడం అనేది అరుదైన ఘనతే. విందు సందర్భంగా వచ్చిన క్రిస్ గేల్‌ను అమితాబ్ ఓ కోరిక కోరాడు. రేపు (గురువారం) భారత్‌తో జరగనున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విజృంభించి ఆడాలని, సెంచరీ కొట్టాలని కోరాడు. బిగ్‌బీ కోరిక తప్పకుండా తీరుస్తానని, సెంచరీ కొడతానని గేల్ కూడా హామీ ఇచ్చాట్ట.
నిజానికి ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌కు వెస్టిండీస్‌తో సెమీస్ మ్యాచ్ చాలా కీలకమైనది. ఆ జట్టు మంచి ఫాంలో ఉంది. చెలరేగుతున్నది. ఇలాంటి సమయంలో క్రిస్‌గేల్‌ను అమితాబ్ వంటి వాళ్లే మరింత రెచ్చగొట్టి సెంచరీకి పురిగొల్పి బరిలోకి దించితే.. మన జట్టును చీల్చి చెండాడుతారేమోనన్నది కొందరి భయం. ఈ సెమీస్ మ్యాచ్‌ను ఇప్పటికే మీడియా మొత్తం విరాట్ కొహ్లి మరియు క్రిస్‌గేల్ ల మధ్య సమరంగా అభివర్ణిస్తున్నది. ఇలాంటి నేపథ్యంలో.. గేల్‌ను సెంచరీ కొట్టమని అమితాబ్ కోరడం, భారత్‌ను కించపరిచే లాంటి కోరిక అని పలువురు క్రీడాభిమానులు అంటున్నారు. అభిమానం ఉంటే విందుకు పరిమితం కాకుండా, ఇలాంటి విపరీతకోరికలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.