కుక్క తోక వంకరని ఎన్నడూ సరిచేయడం సాధ్యం కానట్లే భారత్ పట్ల పాకిస్తాన్ తీరుని, దాని వంకర బుద్ధిని కూడా ఎన్నడూ సరిచేయడం సాధ్యం కాదని పాకిస్తాన్ మరో మారు నిరూపించి చూపింది. మహారాష్ట్రాకి చెందిన భారత మాజీ నేవీ ఉద్యోగి కుల్భూషన్ యాదవ్ అనే వ్యక్తిని పాక్ పోలీసులు బలూచిస్తాన్ లో అరెస్ట్ చేసారు. అతను భారత గూడచారి సంస్థ ‘రా’ కి చెందినవాడని, బలూచిస్తాన్ వేర్పాటువాదులను ప్రోత్సహించడానికి, పాక్ ఆర్ధిక రాజధాని కరాచిలో సంఘ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించి కరాచిలో అల్లకల్లోలం సృష్టించేందుకి పాక్ లో ప్రవేశించాడని ఆరోపించింది. అందుకు సాక్ష్యంగా అతని చేత ఒక వీడియో స్టేట్మెంటు కూడా ఇప్పించి దానిని నిన్న మీడియాకి విడుదల చేసింది. అందులో అతను పాక్ ఏవిధంగా చెప్పాలనుకొందో అక్షరం పొల్లుపోకుండా అలాగే చెప్పడం చూస్తే అతనిని చాలా హింసించి ఆవిధంగా చెప్పించి ఉండవచ్చని అర్ధమవుతోంది.
అందులో అతను ఏమని చెప్పాడంటేనే, “నేను భారత్ నేవీ ఉద్యోగిని. 2022లో నేను నేవీ నుంచి పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ 2002లో నేవీ నుంచి బయటకు వచ్చి 2003లో ఇరాన్ లోని చభర్ అనే ప్రాంతంలో చిన్న వ్యాపారం ప్రారంభించాను. భారత నిఘా సంస్థ ‘రా’ కోసం నేను భారత్ లో చేసిన కొన్ని పనులను చూసిన తరువాత, 2013సం. చివరిలో ‘రా’ నన్ను తన ఏజెంటుగా నియమించుకొంది. అప్పటి నుంచే నేను దాని కోసం ఇక్కడ పనిచేయడం ప్రారంభించాను. బలూచిస్తాన్ లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడం, కరాచీలో సంఘ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించి అశాంతి సృష్టించడం నా పని. బలూచిస్తాన్ లో వేర్పాటువాదానికి మొగ్గు చూపుతున్న కొందరు వ్యక్తులు, విద్యార్ధి సంఘాల నేతలతో నాకు పరిచయాలున్నాయి.”
“భారత ‘రా’ సంస్థ జాయింట్ సెక్రెటరీ అనిల్ కుమార్ గుప్తా ఆదేశాల ప్రకారం వారందరితో నేను మాట్లాడుతూ, దేశం విచ్చినం చేయడానికి వారికి అవసరమయిన సహాయ సహకారాలు అందిస్తుంటాను. పాక్ లో ఉగ్రవాదులను, వేర్పాటువాదులను ప్రోత్సహించి దేశంలో అశాంతి అల్లకల్లోలం సృష్టించడమే ‘రా’ నాకు అప్పగించిన పని. అందుకు నా వ్యాపారం ముసుగులో గతంలో రెండుసార్లు నేను పాకిస్తాన్ వచ్చి వెళ్లాను కానీ అప్పుడు నన్ను ఎవరూ అనుమానించలేదు. కానీ దురదృష్టవశాత్తు ఈసారి పట్టుబడిపోయాను,” అని కుల్భూషన్ యాదవ్ చెప్పాడు.
‘రా’ వంటి ఒక అత్యుత్తమ నిఘా సంస్థలో కటోర శిక్షణ పొందిన ఏ వ్యక్తయినా ఇంత పేలవంగా మాట్లాడుతాడంటే ఎవరూ నమ్మరు. ఒకవేళ అతను నిజంగా ‘రా’ సంస్థ ఎజంటే అయితే పాక్ అధికారుల చేతిలో ప్రాణాలయినా పోగొట్టుకొంటాడు కానీ ఈవిధంగా అరటి పండు ఒలిచి పెట్టి చేతిలో పెట్టినట్లు మాట్లాడడని ఖచ్చితంగా చెప్పవచ్చును.
అతను చెప్పిందే నిజమనుకొన్నా అతను 2003లో ఇరాన్ వెళ్లి స్థిరపడితే, పది సంవత్సరాల తరువాత అంటే 2013లో అతనిని ‘రా’ సంస్థకి ఏజెంటుగా చేరానని వీడియోలో చెప్పుకొన్నాడు. అయితే ‘రా’ లో చెరక మునుపే 2003-04సం.లలోనే తను రెండు సార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చేనని చెప్పుకొన్నాడు. ఈవిధంగా పొంతనలేని మాటలు చెప్పడం గమనిస్తేనే అతను ‘రా’ ఏజెంటు కాదనే సంగతి స్పష్టం అవుతోంది. కానీ పాక్ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఈ అంశాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించేందుకు వీలయినంత ఎక్కువగా హైలైట్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది.
పఠాన్ కోట్ దాడుల తరువాత పాకిస్తాన్ ప్రపంచదేశాల ముందు తలవంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ దాడులకు కుట్ర పన్నినవారిని పట్టుకొని శిక్షించడం కోసం జాయింట్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ని ఏర్పాటు చేసింది. దానిని డిల్లీకి, పఠాన్ కోట్ కి కూడా పంపించింది. కానీ దాని ఉద్దేశ్యం ఈ దాడులకు కుట్ర పన్నినవారిని పట్టుకోవడం కాదు. పాక్ పై పడిన ఆ నిందను ఏదో విధంగా తిప్పి కొట్టి తుడిచేసుకోవడమే. అందుకే అది దర్యాప్తు పేరుతో పఠాన్ కోట్ కూడా వచ్చి డ్రామాలు చేస్తోందని భావించవచ్చును. అయితే ఈ సందర్భంగా భారత్ లో అది చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది కనుక, వాటి నుంచి తప్పించుకోవడానికే బహుశః ఈ ఎత్తు వేసి ఉండవచ్చునని భారత్ విదేశాంగ శాఖ “అధికారికంగా” అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఆ ఆలోచనతోనే అతనిని ఇరాన్ నుంచి పాక్ అధికారులు కిడ్నాప్ చేసి బలూచిస్తాన్ తీసుకువచ్చి అక్కడ అతను పట్టుబడినట్లు డ్రామా ఆడుతున్నారనే అనుమానాలు వ్యక్తం చేసింది. నిర్బంధంలో ఉన్న కుల్భూషన్ యాదవ్ ని పాక్ లోని భారత దౌత్యాధికారులు కలవడానికి పాక్ ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించింది. అతను చెపుతున్నట్లు ఒకప్పుడు నేవీలో పనిచేయడం నిజమే కానీ అతను స్వచ్చంద పదవీ విరమణ చేసి వెళ్లిపోయిన తరువాత నేవీ కానీ భారత్ కి చెందిన ఏ ప్రభుత్వ సంస్థ గానీ అతనితో ఎటువంటి సంబంధాలు కలిగి లేవని విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేసారు.
పాక్ దర్యాప్తు బృందాన్ని డిల్లీ, పఠాన్ కోట్ పర్యటించేందుకు అనుమతించి భారత్ పాక్ ముందు మోకరిల్లిందని కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు పాక్ వేసిన ఊహించని ఈ ఎత్తుతో మోడీ ప్రభుత్వానికి పెద్ద షాక్ వంటిదేనని చెప్పవచ్చును. ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే దానికి చెంప దెబ్బ వంటిదేనని చెప్పవచ్చును. పాక్ వక్ర బుద్ధి ఎన్నటికీ మారదని తెలిసీ భారత ప్రభుత్వం దానిని నమ్మి దాని ముందు సాగిలపడినందుకు పాక్ తగిన గుణపాఠమే చెప్పింది. ఇప్పటికయినా మోడీ ప్రభుత్వం మేల్కొంటుందో లేక ఇంకా పాక్ దయాదాక్షిణ్యాల కోసం దాని ముందు మోకరిల్లుతుందో చూడాలి!