అమెరికన్ అధ్యక్ష పదవి రేసులో దూసుకుపోతున్న రిపబ్లికన్ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ నిన్న సి.ఎన్.ఎన్. న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ “పాకిస్తాన్ నిజంగా చాలా పెద్ద సమస్యగా తయారయింది. ఎందుకంటే దాని వద్ద ఒక వస్తువుంది. దాని పేరు అణ్వాయుధం. కనుక వాళ్ళు అక్కడి పరిస్థితులను అదుపులో ఉంచుకోవలసిన అవసరం చాలా ఉంది. అక్కడి పరిస్థితులను చూస్తున్నప్పుడు, మొన్న గుల్షన్ పార్కులో క్రీస్టియన్లను హతమార్చడం చూసినప్పుడు తట్టుకోలేకపోయాను. అది చాలా దారుణం. కేవలం క్రీస్టియన్లే కాకుండా సామాన్య ప్రజలు చాలామంది ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పుతున్నారు. నేను మాట్లాడుతున్నది ఇస్లాం ఛాందసవాదుల గురించే. నేను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయితే అక్కడి (పాకిస్తాన్) పరిస్థితులని మిగిలిన వారందరి కంటే కూడా బాగా పరిష్కరించగలను,” అని డోనాల్డ్ ట్రంప్ చెప్పారు.
డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతారో లేదో తెలియదు కానీ ఆయన చెపుతున్న విదేశీ విధానం గురించి విని ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతున్నాయి. రెండు రోజుల క్రితమే ఆయన సౌదీ అరేబియాను హెచ్చరించారు. ఐసిస్ ఉగ్రవాదులపై పోరుకి సౌదీ అరేబియా తన సేనలను పంపకపోతే ఆదేశం నుంచి చమురు కొనుగోళ్ళు నిలిపివేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా సౌదీ రక్షణ కోసం అమెరికాకి కొంత డబ్బు చెల్లించవలసి ఉంటుందని కూడా విస్పష్టంగా చెప్పారు. ఇకపై అమెరికా ప్రపంచ పోలీస్ పాత్ర పోషించబోదని, దానికి ఆ అవసరం కూడా లేదని చెప్పారు. మళ్ళీ నిన్న అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడుతూ తను అధ్యక్షుడయితే పాకిస్తాన్ లోని పరిస్థితులను చక్కబెడతానని చెప్పడం విశేషం. అంటే ప్రపంచ పోలీస్ పాత్ర పోషిస్తానని చేపుతున్నట్లే భావించవచ్చును. డోనాల్డ్ ట్రంప్ కనుక అమెరికా అధ్యక్షుడయినట్లయితే, ఆయన అనుసరించబోయే విదేశీవిధానాల వలన మూడో ప్రపంచ యుద్ధం జరిగినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.