హైదరాబాద్: అనంతపురంజిల్లాలో ఇవాళ రైతు భరోసా పాదయాత్రను నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధిపై తెలుగుదేశంపార్టీనేతలు విరుచుకుపడ్డారు. రాహుల్ పర్యటనలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రిలో మాట్లాడుతూ రాహుల్ ఇప్పుడు రాష్ట్రంలో పర్యటించటానికి సమయం, సందర్భం ఏమైనా ఉందా అంటూ రుసరుసలాడారు. ఇక అనంతపురం టీడీపీ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, కేక్ కట్ చేసినట్లు రాష్ట్రాన్ని కట్ చేసింది, ప్రత్యేక హోదాను బిల్లులో పెట్టకుండా మోసంచేసిందికూడా కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. అనంతపురంలో పర్యటించింది రాహుల్ కాదని, రాహువు అని చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలుచేసిన రాహుల్లాంటివారిని తెగనరికినా పాపంలేదని తీవ్రస్వరంతో వ్యాఖ్యానించారు. రాహుల్కు విషయాలపైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అతనొక మొద్దబ్బాయని అన్నారు. ఇక యనమల రామకృష్ణుడు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, ఏపీపై అంత ప్రేమ ఉంటే ప్రత్యేకహోదాకోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఎందుకు పోరాడటంలేదని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు ఏపీని ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తుండగా విమర్శలు చేయటం సిగ్గుచేటని అన్నారు. పదేళ్ళ పాలనలో కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టుకు పైసాకూడా విదల్చలేదని విమర్శించారు. మరోవైపు దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో మాట్లాడుతూ, రాహుల్ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రపర్యటనకు వచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ లోని దొంగలంతో గజదొంగలపార్టీ వైసీపీలో చేరుతున్నారని, మళ్ళీ వారంతా కలిసి కాంగ్రెస్లో కలిసిపోతారని ఉమా అన్నారు.