మెగా హీరోలతో సినిమా అంటే దర్శకులు కాస్త ఆలోచిస్తుంటారు. ఎందుకంటే.. వాళ్లింటి హీరోలతో సినిమా అంటే… కెలికే బ్యాచ్ ఎక్కువగా ఉంటుంది. రామ్‌చరణ్‌తో సినిమా అంటే కథ ముందు చిరంజీవికి వినిపించి ఓకే చేయించాలి. ఆఖరికి హీరోయిన్ గా ఎవరిని ఎంచుకోవాలి అన్నది చిరంజీవి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందట. ఎడిటింగ్ టేబుల్ దగ్గరా చిరంజీవి సినిమాకి రిపేర్లు చేస్తుంటారని వినికిడి. రామ్ చరణ్‌తో సినిమాలు చేసినవాళ్లంతా ఈ ‘బాధ’నీ అనుభవించారు. ఇప్పుడు బన్నీతో సినిమా అన్నా.. ఇంతే గొడవ పడాల్సివస్తోంది.
బన్నీ సినిమా అంటే అల్లు అరవింద్ జోక్యం తప్పనిసరి. ఇది వరకు కథ ఎంపిక, తదితర విషయాలన్నీ ఆయన బన్నీకే వదిలిపెట్టేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. సెట్లో దర్శకుడి కంటే.. అల్లు అరవింద్ హంగామానే ఎక్కువగా కనిపిస్తుంటుందని టాక్. తాజాగా ‘సరైనోడు’ సినిమా విషయంలోనూ అల్లు అరవింద్ కెలుకుడు ఇబ్బందికరంగా మారుతోందట. ఈ విషయంలో బోయపాటి శ్రీను కాస్త నిరుత్సాహానికి గురవుతున్నాడని, ఒకవైపు బన్నీ, మరోవైపు అరవింద్… తన విషయాల్లోనూ జోక్యం చేసుకోవడం శ్రీనుకి నచ్చడం లేదని తెలుస్తోంది. సినిమా నిడివి ఎంత ఉండాలి అన్న విషయంలో బోయపాటి శ్రీను – అరవింద్ మధ్య.. విపరీతమైన రచ్చ నడుస్తోందని రెండు గంటల పది నిమిషాలు దాటి సినిమా ఉండకూడదని అరవింద్ అల్టిమేట్టం జారీ చేశాడని సమాచారం. బోయపాటి మాత్రం రెండున్నర గంటల సినిమా ఉండాల్సిందే అంటున్నాడట. మరి.. ఈ విషయం ఎప్పటికి తేలుతుందో, ఎవరి మాట నెగ్గుతుందో ఏంటో?