హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఇవాళ అనంతపురంజిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. పదికిలోమీటర్ల పాదయాత్ర చేయటంతోబాటు, మధ్యమధ్యలో – ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించారు. రెండు బహిరంగసభలలో ప్రసంగించారు. ఇటు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తెలుగుదేశంపార్టీపైనా, ప్రధాన ప్రతిపక్షం వైసీపీపైనా, అటు ప్రధాని నరేంద్రమోడిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకులు, శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చారు.
రాహుల్ పర్యటనను ఒక్కసారి నిశితంగా గమనిస్తే అతని వ్యవహారశైలిలో దూకుడు స్పష్టంగా కనబడుతోంది. ముందుకంటే చురుకుతనం, వేగం, ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ప్రసంగాలలోకూడా వ్యత్యాసం తెలుస్తోంది. మాట్లాడేటపుడు వేదికపై అటూ ఇటూ నడుస్తూ ప్రత్యర్థులపై ధాటిగా, దబాయింపుగా, పదునుగా విమర్శలు చేస్తున్నారు. మధ్యమధ్యలో పంచ్లుకూడా వేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల తర్వాత విదేశీ పర్యటనలు చేస్తూ విదేశీ బాబు అయిపోయారని అన్నారు. టీడీపీ, వైసీపీ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను మోడి కాళ్ళదగ్గర పెట్టాయని విమర్శించారు. పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణమయ్యేముందు కాంగ్రెస్ సీనియర్ నేతలతో మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పారు. ఏదీ అసాధ్యమని అనుకోవద్దని, పంజాబ్‌లో కాంగ్రెస్ గెలవలేదని ఒకప్పుడు అనుకునేవారని గుర్తుచేశారు. ఇక సభలో కూర్చున్నపుడుగానీ, ప్రజలతో మాట్లాడేటప్పుడుగానీ చాలా క్యాజువల్‌గా, ఇన్ఫార్మల్గా కనిపించారు. ఎండ మండిపోతున్నా పదికిలోమీటర్ల పాదయాత్రను సునాయాసంగా చేసేశారు(ఆయన ఎనర్జీచూసి కాంగ్రెస్ సీనియర్లలోకూడా కొత్త శక్తి వచ్చినట్లయింది). ఎక్కడా తెచ్చిపెట్టుకున్న డాబు, దర్పంలేకుండా అందరితో కలిసిపోతున్నారు. ముఖ్యంగా ప్రజలతో మాట్లాడేటప్పుడు మామూలు రాజకీయనేతలలా కృతకంగా కాకుండా రాహుల్‌లో చిత్తశుద్ధి కనబడటం విశేషం. ఇంతకుముందుకూడా రాహుల్ గురించి వినబడే విమర్శ ఏమిటంటే – ఏదో చేయాలన్న తపన ఉందిగానీ, చొరవ లేదు – అని. అయితే ఇప్పుడుమాత్రం తనే పూనుకుని pro-active అయిపోయి రైతు భరోసా యాత్రలు చేస్తున్నారు…దేశవ్యాప్తంగా తిరుగతున్నారు…పార్టీకి కొత్తరక్తం ఎక్కించటానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఆయన ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో తెలియాలంటే 2019దాకా ఆగాలి. మొత్తంమీద ఈ మధ్య రెండునెలల విరామం తీసుకుని మయన్మార్ వెళ్ళి చేసిన విపాసన కోర్స్ ‘రాగా’కు బాగానే ఉపయోగపడినట్లుంది.
కొసమెరుపు: అయితే రాహుల్(వెర్షన్ 2.0) కొత్త ఉత్సాహంతో ఉరుకుతున్నాడు…అన్నీ బాగానే ఉన్నాయి…మరి ఆ మూడుముళ్ళుకూడా వేసేస్తే బాగుంటుంది కదా. ఉహూ, దానికిమాత్రం ససేమిరా అంటున్నాడట గురుడు ఎందుకనో! ఇవాళ పుట్టపర్తిలో మీడియాతో ఇష్టోగోష్ఠిగా మాట్లాడుతున్నపుడు ఎవరో పెళ్ళిమాటెత్తితే రుసరుసలాడాడట…!