ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్ రావత్ ప్రభుత్వంలోకి తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పటి నుంచి, రాష్ట్ర రాజకీయాలు రోజుకొక ఊహించని మలుపు తిరుగుతున్నాయి. ఈనెల 28న ముఖ్యమంత్రి హరీష్ రావత్ ని శాసనసభలో బలనిరూపణ చేసుకోమని గవర్నర్ ఆదేశించారు. కానీ దానికి కొన్ని గంటల ముందే హరీష్ రావత్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందనే కుంటిసాకుతో కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించింది. దానిని ఆయన హైకోర్టులో సవాలు చేయగా జస్టిస్ యు.సి. దయానీ, రాష్ట్రపతి పాలనపై స్టే మంజూరు చేయడమే కాకుండా, రేపు అంటే 31వ తేదీన హరీష్ రావత్ కి శాసనసభలో బలనిరూపణ చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించారు. హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును కేంద్రప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ లో సవాలు చేయగా, చీఫ్ జస్టిస్ కె.ఎం. జోసఫ్ మరియు జస్టిస్ వి.కె. భిస్త్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ పక్కనపెట్టి, ఈ కేసుపై తదుపరి విచారణను ఏప్రిల్ 6వ తేదీకి వాయిదా వేసింది. అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిందన్న మాట. కనుక రేపు శాసనసభలో హరీష్ రావత్ బలపరీక్ష కూడా ఉండబోదన్నమాట. హైకోర్టు మళ్ళీ దీనిపై విచారణ చేపట్టి తీర్పు చెప్పేవరకు హరీష్ రావత్ ఎదురుచూస్తారో లేకపోతే ఈలోగానే హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేస్తారో చూడాలి.