బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఇది కేవలం సమావేశాలు ముగియడం మాత్రమే కాదు. హైదరాబాదు నగరంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సంబంధించిన అనుబంధం మొత్తం ముగిసిపోయినట్టే భావించాలి. ఎందుకంటే… జూన్2 వ తేదీలోగా అమరావతి నగరం వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక భవనాలు ఒక కొలిక్కి వస్తాయని అంతా అనుకుంటున్నారు. దానికి తగినట్లుగానే.. శాసనసభ వర్షాకాల సమావేశాలు అమరావతిలోనే జరుగుతాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఓ మాట అనేశారు. దీంతో హైదరాబాదు నగరంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఉన్న బంధానికి ఇక ఫుల్స్టాప్ పడినట్లే అని అందరూ భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం.. హైదరాబాదు నగరాన్ని ఏపీ సర్కారు పదేళ్లపాటు రాజధానిగా వాడుకోవడానికి వీలుంది. అసెంబ్లీని కూడా వాడుకోవడానికి వీలుంది. అయితే అసెంబ్లీలో వాటా మరియు భవనాల్లో కేటాయింపుల కోసం తొలుత చాలా సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ఏపీ అసెంబ్లీ స్పీకరు కోడెల శివప్రసాదరావు ఆ తర్వాతి నుంచి ఎప్పుడెప్పుడు గుంటూరు వద్ద తాత్కాలికంగా అసెంబ్లీని నడుపుదామా అనే కోరికతోనే కనిపించారు. కోట్లు ఖర్చు పెట్టి షెడ్లు వేయించి నడపాలని, లేదా, నాగార్జున యూనివర్సిటీలో నడపాలని, కనీసం హాయ్‌ల్యాండ్‌లో నడపాలని ఇలా ఆయన రకరకాల ప్రతిపాదనలు చేసినా.. అసెంబ్లీని గుంటూరు తరలించడానికి ప్రయత్నించినా.. ఎప్పటికప్పుడు చంద్రబాబు వాటిని తిప్పికొడుతూ వచ్చారు. ఆయన ఆలోచనల్ని పట్టించుకోలేదు.
అయితే ఈ బడ్జెట్ సమావేశాలు హైదరాబాదులో చివరి సమావేశాలుగా లెక్కతేలాయి. ఈసారి సమావేశాలకు సభ వెలగపూడి తరలిపోవడం ఖరారుగా కనిపిస్తోంది. మంత్రి నారాయణ చెబుతున్నట్లుగా జూన్ 2 వ తేదీలోగా తాత్కాలిక సెక్రటేరియేట్ భవనాల నిర్మాణం మొత్తం పూర్తయిపోతే గనుక పరిపాలన వ్యవస్థ మొత్తం తరలిపోవడం కూడా గ్యారంటీ. ఎటూ సభాపర్వం ముగిసిపోయింది. హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన తాలూకు ఆనవాళ్లు మొత్తం, అసెంబ్లీ సహా మారో నాలుగు నెలల వ్యవధిలో చెరగిపోనున్నాయన్నమాట.