నందమూరి బాలకృష్ణ వందో సినిమాకి ఓ స్పెషల్ అట్రాక్షన్ వచ్చి చేరిపోయింది. నయనతార, దేవిశ్రీ ప్రసాద్‌లాంటి స్టార్‌లతో బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి కళకళలాడుతోంది. ఇప్పుడు మరో అదనపు ఆకర్షణ.. ఓ బాలీవుడ్ వెటరన్ తార రూపంలో వచ్చింది. ఆమె ఎవరో కాదు.. హూమా మాలినీ! అవును గౌతమి పుత్ర శాతకర్ణిలో హేమామాలినికి ఓ కీ రోల్ దక్కిందని సమాచారం. బాలయ్య తల్లిగా హేమ కనిపించనున్నారని టాక్. గౌతమి పుత్ర శాతకర్ణి లో తల్లీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సినిమాలో గౌతమి రోల్‌కి అత్యధిక ప్రాధాన్యం ఉంది.
ఆ పాత్రలో ఓ స్టార్ ఉంటే బాగుంటుందని క్రిష్ ఆలోచన. అందుకే.. హేమా మాలినీని తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలెట్టారు. బాలయ్య కూడా తన వందో సినిమా ప్రత్యేకంగా ఉండాలని, దాని కోసం ఎంతైనా ఖర్చు చేయండని… ముందే చెప్పేశాడట. ఆ ధైర్యంతోనే క్రిష్… హేమా మాలినీ పేరుని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఆమె గనుక.. ఓకే అయితే.. గౌతమి పుత్ర రేంజు.. మరో పది మెట్లు ఎక్కడం ఖాయం.